మాజీమంత్రికి టీడీపీ-వైసీపీ గేలం!

ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు న‌డుస్తోంది! ముఖ్యంగా ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. ఆయ‌న్ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఒక వ‌ర్గం పోటీ ప‌డుతుంటే.. ఆయ‌న వ‌స్తే త‌మ సీటుకు ఎక్క‌డ ఎస‌రు పెడ‌తారోన‌ని మ‌రో వ‌ర్గంలో ఆందోళ‌న మొద‌లైంది. అంతేగాక ఆయ‌న రాక‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నాలు కూడా మొద‌లుపెట్టారట‌. టీడీపీలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. వైసీపీలో మరింత‌ వింతైన ప‌రిస్థితి నెల‌కొంది. మాజీ మంత్రి చేరితే త‌మ పార్టీకి బ‌ల‌మైన అండ దొరుకు తుంద‌ని భావిస్తుంటే.. ఆయ‌న మాత్రం నంద్యాల ఓట‌మి ప్ర‌భావంతో వెన‌క‌డుగు వేస్తున్నార‌ని తెలుస్తోంది!!

నేతల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు….

ఏపీలో సాధార‌ణ ఎన్నికలు ముగిసి మూడున్నరేళ్లు దాటిపోయింది. ఇక 2019 ఎన్నికల మూడ్ ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్షాలు ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధం చేస్తున్నాయి. తీసివేతలు, కూడికలు మొదలయ్యాయి. నేతల సామర్ధ్యాలను అంచనా వేసేందుకు అధినేత‌లు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. అంతేగాక ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని బ‌ల‌మైన అభ్య‌ర్థులెవ‌రనా అంశాల‌పైనా దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ-వైసీపీ మ‌ధ్య రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారో తేల్చుకోలేకపోతున్నారు. అధికార పార్టీలో వర్గపోరు ఎసరు పెడుతుంటే.. ప్రతిపక్ష నేతల వైఖరిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.

బలమైన నేత….

జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధానంగా కందుకూరు నియోజకవర్గాన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ కీలక నేతగా పేరున్న మాజీ మంత్రి.. సీనియర్ నేత మానుగుంట మహీధర్‌రెడ్డి కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆయనను తమ పార్టీలోకి రమ్మంటూ ఇప్పటికే పార్టీలు పిలుస్తున్నాయి. నియోజకవర్గంలో సీటుతో పాటు సముచిత స్ధానంపై భరోసా కావాలంటూ మహీధర్‌రెడ్డి షరతు పెట్టడంతో ఆయా పార్టీలు స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలో సీనియర్‌ నేత అయిన మహీధర్‌రెడ్డికి తనకంటూ ప్రత్యేక వర్గం కూడా ఉంది. చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్, అన్నా రాంబాబు, ముక్కు కాశిరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఇలా చాలామంది మహీధర్‌రెడ్డికి విశ్వాసపాత్రులు.

టీడీపీతోనూ టచ్ లో…..

దీంతో వైసీపీ, టీడీపీ నాయ‌కులు మహీధర్‌రెడ్డిని త‌మ వైపు లాక్కునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయన సున్నితంగా వీటిని తిర‌స్క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక జిల్లాలో మహీధర్‌రెడ్డి వర్గానికి చెందిన వారు ఎక్కువగా టీడీపీలో ఉన్నారు. వారిలో కొందరితో మహీధర్‌రెడ్డి విందు రాజకీయాలు నడిపినట్లు తెలుస్తోంది. మరోవైపు మహీధర్‌రెడ్డి రాకతో రెండు పార్టీల్లోని కొందరు నేతలు తమ ఉనికికి ప్రమాదంగా భావిస్తున్నారు. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పోతుల రామారావుకు నియోజకవర్గంలో వర్గ పోరు పొంచి వుంది. దీంతో పార్టీ రోజురోజుకు నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్న పరిస్థితి స్ఫష్టమవుతోంది. దీనికితోడు ఆయనపై అందిన నివేదికను చూసి సీఎం పెదవి విరిచినట్లు తెలుస్తోంది.

ఫీడ్ బ్యాక్ బాగా లేకపోవడంతో….

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో టీడీపీలోకి జంప్ చేశారు. అయితే ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే దివి శివ‌రాం టీడీపీలో ఉన్నారు. ఈ గ్రూపు రాజ‌కీయాల నేప‌థ్యంలో పోతుల రామారావు ఇప్ప‌ట‌కీ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించ‌లేక‌పోయారు. క్షేత్రస్థాయిలో దూసుకెళ్ల‌లేకపోయారు. దీంతో బాబుకు ఆయ‌న‌పై స‌రైన ఫీడ్‌బ్యాక్ లేదు. ఇటు వైసీపీ పరిస్థితి కూడా దారుణంగా మారింది. ప్రస్తుతం తూమాటి మాధవరావు ఒక్కరే వైసీపీకి దిక్కయ్యారు. దీంతో బలమైన నేత కోసం వైసీపీ నేతలు కూడా కరసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహీధర్‌రెడ్డిని పలుమార్లు కలిశారు. అయితే నంద్యాలలో వైసీపీ ఓటమితో ఔత్సాహిక నేతలు సైతం వెనకడుగు వేస్తున్నార‌ట‌. మ‌రి ఆయ‌న అనుగ్ర‌హం ఎవ‌రిమీద ఉంటుందోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు!!

Ravi Batchali
About Ravi Batchali 40561 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*