
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు హోరా హోరీగా తలపడేందుకు రెడీ అయ్యాయి. కర్ణాటక రెండు జాతీయపార్టీలు ఎలాగైతే పోరు చేసుకున్నాయో.. ఇక, రాబోయే కొద్ది రోజుల్లోనే ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు అంతకన్నా ఎక్కువగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్ని కల్లో గెలిచేందుకు ఇరు పార్టీలూ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ రెండడుగులు ముందే ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు కొన్ని అస్త్రాలు కూడా లభిస్తున్నాయి. టీడీపీ దెబ్బ కొట్టడంలో జగన్‌కు ఈ అస్త్రాలు విస్తృతంగా ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నాడు.
అసంతృప్తులకు కండువాలు కప్పేస్తూ….
ముఖ్యంగా టీడీపీలోని అసంతృప్తులను జగన్ తన పార్టీలో చేర్చుకుంటున్నారు. అంతేకాదు, టీడీపీలో టికెట్ లభించని వారిని కూడా తాను చేరదీస్తున్నాడు. ఫలితంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని బలహీనం చేసేందుకు జగన్ తన శాయ శక్తులా ప్రయత్నిస్తున్నాడు. ఇక, కృష్ణా వంటి జిల్లాల్లో అయితే, జిల్లాలనే ప్రభావితం చేయగలరు అనుకున్న నేతలకు జగన్ పిలిచి మరీ పదవులు, టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే విజయవాడ తూర్పుమాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని జగన్ పిలిచి కండువా కప్పాడు. ఈయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున తూర్పు నియోజకవర్గం సీటును కోరుకున్నాడు. అయితే, పార్టీ అధినేత దీనికి విముఖత వ్యక్తం చేయడంతో జగన్ సరైన సమయంలో స్పందించి రవిని పార్టీలోకి తీసుకున్నాడు. అదేవిధంగా మైలవరం టికెట్ ఆశించిన టీడీపీ సీనియర్ కుటుంబం వసంత నాగేశ్వరరావుకు కూడా జగన్ హామీ ఇచ్చారు.
టీడీపీ మాజీలను కూడా…
ఫలితంగా వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్ తాజాగా వైసీపీ గూటికి చేరుకున్నాడు. అదేవిధంగా ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతోన్న మాజీలను తిరిగి పార్టీలో రప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్. కొందరితో ఇప్పటికే తన నమ్మిన బంట్లతో మంతనాలు జరిపిస్తున్నాడు. ఈసారి అధికారంలోకి వచ్చింది వైసీపీనే.. పార్టీలోకి వస్తే పదవితో పాటు సముచిత స్థానం కల్పిస్తామంటూ వల విసురుతున్నారు. ప్రధానంగా కాపులకు పెట్టింది పేరైన ఉభయ గోదావరి జిల్లాల్లో పాగా వేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికి ఈ రెండు జిల్లాలూ టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానంటూ.. చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈ రెండు జిల్లాలూ సైకిల్‌కి దారిచ్చాయి.
కృష్ణాలో పూర్తి చేసుకుని….
అయితే, ఇప్పుడు ఆ హామీ గాలిలో దీపంలాగా మారడంతో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి తోడు పార్టీలోను, ప్రభుత్వంలోనూ పదవులు ఆశించి భంగ పడిన వారూ ఉన్నారు. వీరంతా అధినేతపై గుర్రుగా ఉన్నారు. వీరిని పసిగట్టి తన గూటికి చేర్చుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ వ్యూహాత్మ కంగా ముందుకు సాగుతున్నాడు. ఇక కృష్ణా జిల్లా పాదయాత్రను కంప్లీట్ చేసుకుంటోన్న జగన్ ఈ నెల 14న పశ్చిమగోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతున్నాడు. గత ఎన్నికల్లో ఈ జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసి పడేసింది.
ఇద్దరు మాజీ ఎమ్మెల్యలతో పాటు….
వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కనీసం సగానికి పైగా సీట్లు గెలుచుకోవాలని జగన్ పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే జిల్లాలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో ఇద్దరు సీనియర్ లీడర్లను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచే కీలకంగా ఉన్న వారు కూడా వైసీపీలో చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సొంత నియోజకవర్గం అయిన నరసాపురంపై కూడా జగన్ కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలో టీడీపీని దెబ్బకొడితే..రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రభావం ఉంటుందని భావించి ఇక్కడ మాజీలను తనవైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నాడు. రాజకీయాల్లో ఏదీ నేరం కాదు అన్నవిధంగా జగన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తే.. ఇక, వైసీపీకి ఎదురుండదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Leave a Reply