మాటలకు, చేతలకు పొంతన లేనీ రాజకీయాలు: పవన్

ప్రస్తుత రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండడంలేదని జనసేన నేత అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ 2017 కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అక్కడి విద్యార్ధులు., యువతను ఉద్దేశించి ప్రసంగించారు. తాను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లోని పాఠాలకు, బయట పరిస్థితులకు తేడా గుర్తించినట్లు తెలిపారు. నేటి రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయని అన్నారు. పార్టీలు మేనిఫెస్టోలో చెప్పేదొకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది మరొకటని ఆయన విమర్శించారు.

తాను చదువులో రాణించలేకపోవడంతో చాలా బాధపడ్డానని, ఒక దశలో అయితే డిప్రేషన్‌తో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సమాజాన్ని పరిశీలించడం, అన్యాయాన్ని ప్రశ్నించడం తనకు స్వభావరీత్యా అలవడ్డాయని అన్నారు. ఈ ఆలోచనలు తీవ్రంగా ఉండడంతో తాను నక్సలైట్లతో కలిపోతానని కుటుంబ సభ్యులు భయపడ్డారని పవన్ తెలిపారు. తనకు నటనలో మొదటిలో ఆసక్తి లేదని, తానొక యోగిని కావాలని అనుకునేవాడినని పవన్ అన్నారు. అయితే జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలని అన్నయ్య తనను ఇడియట్ అని తిట్టి చెప్పడంతో తాను మనసు మార్చుకున్నానని చెప్పారు. హార్వర్డ్ విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ ప్రసంగం ప్రారంభించిన పవన్ మనసువిప్పి మాట్టాడారు. తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. గత కొన్నేళ్లుగా హార్వర్డ్‌ యూనివర్శిటీ విద్యార్ధులు ఇండియన్ పేరుతో నిర్వహిస్తోన్న కాన్ఫరెన్స్‌లో ఈ సారి పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ప్రభావశీలురైన వ్యక్తులతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా తన రాజకీయాల్లో వేగం పెంచాలని భావిస్తున్నారు. సినిమాలు., రాజకీయాలు జోడెడ్లు కావని పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలన్నదే తన అభిమతమని పవన్ స్పష్టం చేశారు. అయితే తన వెంట వచ్చే వారు కూడా చిత్తశుద్ధితో ఉంటే మార్పును త్వరలోనే తీసుకురావచ్చని పవన్‌ చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*