
గత ఎన్నికల్లో కలిసి పనిచేసిన మూడు పార్టీలూ ఇప్పుడు విడిపోయాయి. మూడు పార్టీలదీ మూడు దారులయింది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేయగా జనసేన దానికి మద్దతు పలికింది. దీంతో చంద్రబాబుకు అధికారం దక్కడం సులువుగా మారింది. టీడీపీ, వైసీపీకి గత ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 1.9శాతం మాత్రమే. అప్పుడు మోడీ చరిష్మాతో పాటు, చంద్రబాబు అనుభవం, పవన్ కల్యాణ్ క్రేజ్ టీడీపీని అధికారంలోకి తెచ్చాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
మూడు పార్టీలూ విడిపోయి….
అయితే 2014 ఎన్నికలకు, రాబోయే ఎన్నికలకు పూర్తిగా సీన్ రివర్స్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పటికే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎన్డీఏలో కొనసాగుతున్నప్పటికీ త్వరలోనే దాన్నుంచి కూడా బయట పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న పార్టీతో చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే సాహసం చేయరు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ విడిపోయి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం.
పవన్ ఒంటరిగానే….
ఇక గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతిచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు రూటు మార్చారు. అటు బీజేపీపైనా, ఇటు టీడీపీపైన ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు సర్కార్ పనితీరును కడిగిపారేశారు. గత ఎన్నికల్లో అనుభవం చూసి, రాష్ట్రాభివృద్ధికి సాధ్యపడుతుందని పవన్ చెప్పారు. అయితే ఇప్పుడు అవినీతితో కూరుకుపోయిన టీడీపీతో ఎలా కలసి నడుస్తామని కూడా జనసేనాని ప్రశ్నించారు. అభివృద్ధి మొత్తం ఒక్కచోటే పరిమితమవుతోందని, కొందరికే అన్నీ దక్కుతున్నాయని ఆయన పదునైన విమర్శలతో పసుపు పార్టీని ఇరకాటంలోకి నెట్టేశారు. దీంతో పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జత కట్టరన్నది తేలిపోయింది.
ఎవరికి లాభం?
పవన్ కమ్యునిస్టులు, ఇతర ప్రజాసంఘాలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో ట్రయాంగల్ ఫైట్ ఖాయంగా కన్పిస్తుంది. ఒకవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రతో జనంలో దూసుకు వెళుతున్నారు. చంద్రబాబు తనదైన అనుభవంతో పార్టీని గెలుపు తీరాలకు తీసుకెళ్లాలని వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలు చంద్రబాబు, జగన్, పవన్ ల మధ్యనే సాగుతుందన్నది వాస్తవం. మరి పవన్ చీల్చే ఓట్లు ఎవరికి లాభిస్తాయో? ఎవరిని అధికారానికి దూరం చేస్తాయో చూడాలి.
Leave a Reply