
ముద్రగడ ఏం చేసినా సంచలనమే. ఆయనను బయట అడుగుపెట్టనీయకుండా ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోంది. పాదయాత్ర చేస్తామంటే గృహనిర్భంధం చేసేసింది. ఆత్మీయ సమావేశాలంటే కుదరదని చెప్పేసింది. ఏది చేసినా అనుమతి తీసుకోవాలంటోంది. అయితే ప్రభుత్వ అనుమతిని తీసుకునేందుకు ముద్రగడ ససేమిరా అంటుండటంతో ఎవరూ మెట్టు దిగని పరిస్థితి. కాపు రిజర్వేషన్లపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ముద్రగడను ఎలాగైనా కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముద్రగడ ఒక వ్యూహం రచిస్తే… దానికి ప్రతివ్యూహాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేస్తోంది. ముద్రగడ కూడా ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో అందివచ్చిన ఏ అవకాశాన్ని ముద్రగడ వదులుకోవడానికి ఇష్టపడటం లేదు.
వనభోజనాలే వేదికగా…..
ప్రస్తుతం కార్తీక మాసం. ప్రతి ఆదివారం వనభోజనాలు జరుగుతాయి. అదీ తూర్పు గోదావరి జిల్లాలో అయితే కులాలు వారీగా విడి పోయి ఎక్కడికక్కడ వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం మామూలే. అదే ఇప్పుడు ముద్రగడకు కలిసి వచ్చింది. కార్తీక వనభోజనాలతో కాపు సామాజికవర్గం ఏర్పాటు చేసిన వనభోజనాల్లో ముద్రగడ పాల్గొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు కార్తీక మాస వనభోజనాలు రాజకీయ వేదికలుగా మారాయి. ముద్రగడ వెంటనే అక్కడ వాలిపోయి చంద్రబాబు కాపులకు చేసిన అన్యాయాలను వివరిస్తున్నారు. వేల సంఖ్యలో కాపు సామాజిక వర్గానికిచెందిన ప్రజలు హాజరవుతున్నారు. గత ఆదివారం అయినవిల్లి మండలం వీరవల్లి పాలంలో జరిగిన కాపుల వనభోజన కార్యక్రమానికి ముద్రగడ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఏడు వేల మంది హాజరయ్యారు. అలా తూర్పుగోదావరి జిల్లాలో కాపులు ఎక్కడ వనభోజనాలు ఏర్పాటు చేసినా హాజరయ్యేందుకు ముద్రగడ సిద్ధమయ్యారు. కాపులు కూడా ముద్రగడను తమ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. దీనికి పోలీసులు సయితం ఏమీ చేయలేకపోతున్నారు. ముద్రగడ ఎత్తును గ్రహించిన టీడీపీ ప్రత్యేకంగా కాపులతో వనభోజనాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. మొత్తం మీద ముద్రగడ కొత్త ఎత్తు ముందు ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది.
Leave a Reply