
మరికొద్ది గంటల్లోనే జీఎస్టీ అమల్లోకి రానుంది. దీంతో భారత ప్రధాని నరేంద్రమోడీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్లతో చెలరేగిపోయారు. జీఎస్టీని అర్ధరాత్రి తీసుకువస్తూ ప్రజలపై పెను భారం మోపనున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. అంతేకాదు జీఎస్టీని కూడా పెద్ద నోట్ల రద్దుతోనే రాహుల్ పోల్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత ప్రజలు ఏవిధంగా ఇబ్బందులు పడ్డారో జీఎస్టీతో కూడా అలాగే ఇబ్బందులు తప్పవన్నానరు. పరిపక్వత లేకుండా, మతి లేకుండా ప్రభుత్వం జీఎస్టీని అమలు చేస్తుందని దుయ్యబట్టారు. జీఎస్టీ ప్రారంభ వేడుకలను తమ పార్టీ ప్రచారం కోసం ప్రభుత్వం వినియోగిస్తుందన్న రాహుల్ జీఎస్టీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు.
హాజరుకావాలన్న వెంకయ్య…..
మరోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జీఎస్టీని సమర్ధించారు. అర్ధరాత్రి సమావేశాలంటే అదేదో తప్పు చేసినట్లుగా విపక్షాలు భావిస్తున్నాయని, అయితే ప్రత్యేక పార్లమెంటు సమావేశం పార్టీల సమావేశం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు వెంకయ్యనాయుడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తమ ఆలోచనను విరమించుకుని సమావేశాలకు హాజరైతే బాగుంటుందని వెంకయ్యసూచించారు. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక సంస్కరణలకు నేడు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందన్నారు. అందువల్ల సమావేశాలను బహిష్కరించామని చెప్పిన పార్టీలన్నీ ఈ ప్రత్యేక సమావేశానికి హాజరైతే బాగుంటుందని వెంకయ్య సూచించారు.
Leave a Reply