
గోవులను రక్షించే పేరిట దాడులు చేస్తే తాటతీస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే గోరక్షకుల పేరిట ఒక హత్య జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. జార్ఘండ్ లోని రామఘడ్ జిల్లాలోని బజర్తంగ్ గ్రామంలో ఈ అమానవీయమైన ఘటన చోటుచేసుకుంది. అలీముద్దీన్ అనే మాంసం వ్యాపారి కారులో బీఫ్ ను తరలిస్తున్నాడని అనుమానించిన కొందరు వ్యక్తులు అతనిపై దాడి కేశారు. కారుకు కూడా నిప్పంటించారు. అయితే వెంటనే కొందరు స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో వారు వచ్చేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలీముద్దీన్ మృతి చెందాడు.
దారుణంగా హత్య చేసి…..
అలీముద్దీన్ పై దాడులు చేయడంతో పాటు కొన్ని మాసం ముక్కలు చెల్లా చెదరుగా పడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారు తగలబడుతున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిజర్ జిల్లాలో పది రోజుల క్రితం మరో సంఘటన జరిగింది. ఒక ఇంట్లో ఆవు కళేబరం కన్పించడంతో ఆ ఇంటిపై రెండు వందల మంది యువకులు దాడి చేసి ఇంటికి నిప్పు పెట్టారు. తాజాగా అలీముద్దీన్ సంఘటనతో జార్ఖండ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పక్కా ప్రణాళికతోనే కావాలని కొందరు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాని మాటలను గోసంరక్షకులు పెడచెవిన పెడుతున్న విషయం మరోసారి స్పష్టమయింది.
Leave a Reply