
మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఎటాక్ ప్రారంభించినట్లు అర్థమవుతోంది. ఆయన గతకొంతకాలంగా మౌనం పాటిస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ సర్కార్ లో అధిష్టానం వద్ద పట్టున్న మంత్రిపైనే ఆయన వ్యాఖ్యలు చేయడం సంచలనం కల్గిస్తోంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఆయన విమర్శలు చేశారు. తన నియోజకవర్గంలో విచ్చలవిడిగా మంత్రి ప్రత్తిపాటి పేరుచెప్పుకుని కొందరు అక్రమ మైనింగ్ సాగిస్తున్నారన్నారు. ఇప్పటికే వంద కోట్ల విలువైన మట్టిని మంత్రి ప్రత్తిపాటి సహకారంతో తరలించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
టీడీపీ నేతల సహకారం లేక….
గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రావెల కిశోర్ బాబును మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత కొన్నాళ్లు విదేశాలకు వెళ్లి వచ్చారు. అయితే ఆయనపై నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. రావెల టీడీపీ కార్యకర్తలకు కాకుండా ఇతర పార్టీల కార్యకర్తలకు సహకరిస్తున్నారని వారు బహిరంగంగా ఆరోపించారు. మంత్రి అయ్యన్నపాత్రుడిని కూడా నియోజకవర్గంలో అడ్డుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ వ్యవహారంలోనూ రావెలకు పార్టీ అధినేత నుంచి సహకారం లభించలేదు.
మంత్రి ప్రత్తిపాటిపై ఆరోపణలు…
దీంతో కొంతకాలంగా రావెల తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మందకృష్ణ మాదిగకు సహకరిస్తున్నారన్న కారణంగా ఒకసారి చంద్రబాబు పిలిచి మందలించారని కూడా చెబుతారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో రావెల పెద్దగా పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రావెల కిశోర్ బాబు అదే జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తన నియోజకవర్గంలో విచ్చలవిడిగా మైనింగ్ చేస్తున్నారని, మంత్రి పేరు చెప్పి వందల కోట్లు మట్టిని తరలించుకుపోయినా అడ్డుకోవడం లేదని ఆరోపించారు.
పార్టీని బద్నాం చేయడానికేనా?
అంతేకాకుండా ఈ విషయాన్ని మంత్రి ప్రత్తిపాటి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రావెల ఆరోపంచారు. మిర్చియార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు కుమారుడు అనిల్ కూడా అక్రమ మైనింగ్ చేశారని రావెల ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని రావెల ప్రశ్నించారు. వీరి కారణంగానే పార్టీకి చెడ్డపేరు వస్తుందని రావెల పేర్కొనడం గమనార్హం. అయితే రావెల ఇలా స్పందించడం వెనక రాజకీయ కారణాలున్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు చంద్రబాబు టిక్కెట్ ఇవ్వడం కష్టమేనని భావించిన రావెల పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించారంటున్నారు.
Leave a Reply