
ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పై సినీనటుడు పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో సంచలనమే అయ్యాయి. నంది అవార్డులపై శాసనసభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు పోసానికి తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఆయన అత్యవసర మీడియా సమావేశం నిర్వహించి మరీ మంత్రి నారా లోకేష్ పై భరత నాట్యం, కూచిపూడి కధాకళీ అన్ని కలిపి చేసేసారు. అసలే రచయిత, నటుడు కూడా అయిన పోసాని తన హావభావాలతో నిర్వహించిన ప్రెస్ మీట్ పై ముగిసిపోయింది అనుకున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
కులంపై పోసాని ఘాటు వ్యాఖ్యలు …
నంది అవార్డుల ఎంపికలో 14 మంది కమ్మవారే జ్యూరి సభ్యులుగా ఉండటాన్ని పోసాని తీవ్రంగా ఖండించారు. అలాంటి కమిటీ ఎంపిక చేసిన తన నందిని వెనక్కు ఇచ్చేస్తున్నా అంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. కమిటీ లో అంతమంది కమ్మవారు ఉంటే వారు ప్రతిభావంతులైన కమ్మవారికి అవార్డు లు ఇచ్చినా ప్రజల్లో వేరే రకంగానే మాట పడాలిసి వస్తుందన్నారు పోసాని. ఇలాంటి వివాదాస్పద అవార్డు తీసుకోవడం కన్నా వదులు కోవడమే మంచిదని జీవితంలో తాను నంది అవార్డు రావాలని తీసుకోవాలని భావించడం లేదన్నారు.
మేం రోహింగ్యాలమా …?
మంత్రి గా నారా లోకేష్ ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టం దౌర్భాగ్యమని, హైదరాబాద్ లో వున్న కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలన్నారు పోసాని. ఒక పదిమంది బాగా మాట్లాడేవారిదగ్గర లోకేష్ కి శిక్షణ ఇప్పించాలని అలాంటి వ్యక్తి భవిష్యత్తు లో ముఖ్యమంత్రి అయితే ఇక ఇంతే సంగతులన్నారు ఆయన. ఆధార్ కార్డు లేనివారు హైదరాబాద్ లో వుంటూ టాక్స్ లు కడుతూ విమర్శలు చేయడం ఏమిటన్న ఆయన జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు లోకేష్ మీద పోసాని. ఇటు తెలంగాణ కాక అటు ఆంధ్ర కాక రోహింగ్యాల లా మమల్ని చూస్తారా అంటూ రెచ్చిపోయారు. ఏపీ విడిపోయినా పదేళ్లు హైదరాబాద్ లో ఉండొచ్చు తరువాత కొనసాగవచ్చని కేసీఆర్ సహృదయానికి పాదాలు పట్టుకుంటా అని పోసాని వ్యాఖ్యానించారు.
అక్కడ ఆస్తుల కొనుగోళ్ళ కోసమే అమరావతి వెళ్లారు….
అధికార పార్టీ నేతలు ఏపీ మీద ప్రేమతో హైదరాబాద్ విడిచి వెళ్లలేదని ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ చేసేందుకే టిడిపి నేతలు అక్కడికి వెళ్ళి రాజధాని పేరుతో దందాలు మొదలు పెట్టారని ఆరోపించారు పోసాని. అమరావతి చుట్టుపక్కల టిడిపి వారు మాత్రమే ఎకరాలకు ఎకరాలు కొన్నారని అలాంటిది హైదరాబాద్ లో వున్నవారిని నాన్ రెసిడెంట్స్ అంటే తన హృదయం భగ్గుమంటుందని చెలరేగారు. హైదరాబాద్ లో ఇప్పుడు ఉన్న టిడిపి నేతలకు ఆస్తులు లేవా ? వారు ఇక్కడ పన్నులు కట్టడం లేదా అంటూ విమర్శలు గుప్పించారు. పొట్ట చేత పట్టుకువచ్చిన ఆంధ్రులను తెలంగాణ ప్రభుత్వం తరిమికొట్టకుండా అక్కున చేర్చుకుంటే ఏపీలో నాన్ రెసిడెంట్ అంటూ దూరం చేస్తారా అని పోసాని కృష్ణ మురళి వాపోయారు. విమర్శలు వస్తే స్వీకరించి సరిచేసుకోవాలి కానీ నంది అవార్డులే రద్దు చేస్తామని పత్రికల్లో రాయించి బెదిరించడం ఏమిటని ? ఎవడబ్బ సొత్తు ఇస్తున్నారు అవార్డులకు అంటూ దుమ్ము దులిపేశారు పోసాని. భారత రత్న, పద్మ అవార్డులపై కూడా విమర్శలు వచ్చాయని అయితే వాటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందా అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేశారు ఆయన. పోసాని తాజా వ్యాఖ్యలతో ఇప్పుడు టిడిపి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి.
Leave a Reply