
వంగవీటి రాధా తనపై వస్తున్న ప్రచారానికి తెరదింపేశాడు. విజయవాడ వైసీపీ నేతగా ఉన్న వంగవీటి రాధా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన రాధా ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై కన్నేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని వంగవీటి భావిస్తున్నారు. అందుకోసం వైసీపీ అధినేత అడుగుజాడల్లో పయనించేందుకు రాధా సిద్ధమయ్యారు. గత రెండు రోజుల నుంచి వంగవీటి రాధా విజయవాడలో పాదయాత్ర చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి పలకరిస్తున్నారు. సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
నియోజకవర్గంలో పాదయాత్ర….
వైసీపీ అధినేత జగన్ కూడా పాదయాత్ర చేపట్టడంతో రాధాకు కూడా ఊపు వచ్చినట్లుంది. అధినేత దృష్టిలో పడాలని ఆయన ప్రజల ముందకు వెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అయితే రాధాకు ఇక్కడ చాలా చిక్కులున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెడీగా ఉన్నారు. ఆయన ఇటీవలే పార్టీలో చేరారు. జగన్ పాదయాత్రలో కూడా మల్లాది విష్ణు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో మల్లాదికే సీటు గ్యారంటీ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ప్రచారం జరుగుతుండగానే రాధా సెంట్రల్ నియోజకవర్గంపై కన్నేయడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నాటికి పార్టీ అధినేతకు ఇది తలనొప్పిగా పరిణమించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ప్రజల ముందుకు రాని రాధా పాదయాత్ర పేరుతో అయినా బయటకు వచ్చారని ఆ పార్టీ నేతలు ఆనందపడిపోతున్నారు. అయితే వంగవీటి రాధా ప్లాన్ వేరేగా ఉందట. పాదయాత్రతో ప్రజలకు దగ్గరగా ఉంటే వైసీపీలో టిక్కెట్ దొరకకపోయినా… జనసేన టిక్కెట్ తోనైనా పోటీ చేయాలని భావించడం వల్లనే పాదయాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది.
Leave a Reply