
బెజవాడ రాజకీయాల్లో అత్యంత కీలక రోల్ పోషించి.. విజయవాడ గడ్డపై తనకంటూ గుర్తింపు సాధించిన వంగవీటి మోహనరంగా వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వంగవీటి రాధా.. రాజకీయాల్లో తనదైన శైలిలో నెట్టుకు రాలేక పోతున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. వంగవీటి పేరును కొనసాగిస్తారనుకున్న రాధా అనూహ్యంగా రాజకీయంగా తెరమరుగు అవుతున్నారనే వ్యాఖ్యలు జోరందున్నాయని తెలుస్తోంది. యువకుడైన రాధా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తారని భావించామని, అయితే, ఆయన అటు రంగా ప్రస్థానాన్ని కాపాడలేక, ఇటు తనకంటూ ఓ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేసుకోలేక పోయారు.
తండ్రి పేరుతోనే….
వంగవీటి రంగా భుజానికెత్తుకున్న కాంగ్రెస్ జెండానే 2004లో వంగవీటి రాధా కూడా మోసారు. అదే ఏడేదా జరగిన ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి ఘన విజయం సాధించారు. రంగా కుమారుడిగా.. ఉన్న ప్రజాదరణ, సానుభూతి, అప్పుడు టీడీపీపై ఉన్న ప్రజావ్యతిరేకత, నియోజకవర్గంలో రంగాకు ఉన్న ప్రాబల్యంతో రాధా సునాయాసంగా విజయం సాధించారు. అయితే, ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆయన అదే ఊపును కొనసాగించలేకపోయారు. అప్పట్లో విజయవాడ మునిసిపల్ మహిళా కమిషనర్‌తో గొడవ పడి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కారణమయ్యాడు. ఇక 2009 నాటికి.. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి రాజకీయంగా ఘోరమైన తప్పు చేశారు. అప్పట్లో ‘చిరంజీవి’ పార్టీ గెలవడం కష్టమనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.
చేతులు కాల్చుకుని….
అయినా కూడా కాపు నేత అనే ఒకే ఒక్క కారణంగా రాధా.. ప్రజారాజ్య పార్టీలోకి వెళ్లి చేతులు కాల్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున 2009లో పోటీ చేసిన ఆయన ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక, ఆ తర్వాత జగన్ పెట్టిన వైసీపీలోకి చేరి.. 2014లో టికెట్ కూడా సంపాయించుకున్నాడు. అయితే, అప్పటి ఎన్నికల్లో బాబు హవా వీయడంతో ఓటమి పాలయ్యాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఆయన ఉన్న వైసీపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే టాక్ నడుస్తోంది. దీంతో ఇల్లు వదిలి బయటకు వచ్చేందుకు కూడా రాధా ఇష్టపడడంలేదు.
వైసీపీకి దూరంగా….
దీంతో పార్టీ నిర్వహిస్తున్న ఏకార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. దీనికితోడు .. వైసీపీ నేత.. పూనూరు గౌతం రెడ్డి వంగవీటి హత్య కు సంబంధించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరింతగా బాధించాయి. దీంతో పార్టీ ఆయనపై చర్య తీసుకుంటుందని అనుకున్నా అది కూడా ఆశించన మేరకు జరగలేదు. ఆయనను పార్టీ అధిష్టానం పార్టీ నుంచి తప్పించలేదు. దీంతో పార్టీలో రాధాకృష్ణను ఉంటే ఉండమన్నట్లు లేకపోతే పొమ్మనట్లుగా అధిష్టానం వ్యవహరిస్తోందని రాధా వర్గం పేర్కొంటోంది. అవసరమైనప్పుడు రాధాకృష్ణను పార్టీ వాడుకుంటోందని.. అవసరం లేకపోతే పట్టించుకోవడం లేదనే భావన వ్యక్తమవుతోంది. దీంతో రాధాకృష్ణ ఇక వైసీపీలో ఇమడలేని పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన జనసేనలోకి ఆహ్వానిస్తే.. వెంటనే జంప్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు కూడా సమాచారం. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Leave a Reply