
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం చేయిస్తున్న సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్టులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మల్యేలకు తాజాగా పంచాయతీ ఎన్నికల రూపంలో మరో అగ్నిపరీక్ష ఎదురవుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల ఆధారంగానే నేతలకు గ్రేడింగ్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మంత్రులు, ఎమ్మల్యేలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. ఇటీవల పంచాయతీ రాజ్ చట్టంలో కీలక మార్పులతో కొత్త చట్టం తెచ్చింది ప్రభుత్వం.
నిర్ణీత వ్యవధిలోనే….
అంతేగాకుండా నిర్ణీత వ్యవధిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా వేల సంఖ్యలో శివారు పల్లెలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నుంచి కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వస్తుందని, పాత పంచాయతీలతోపాటు కొత్తగా ఏర్పడుతున్న పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని సీఎం కేసీఆర్ పరోక్షంగా సంకేతాలు అందించారు.
సిట్టింగ్ లందరికీ సీట్లు…..
ఇటీవల రాజ్యసభ ఎన్నికలు, శాసన సభ సమావేశాలకు ముందు సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి, ఇద్దరు ముగ్గురికి తప్ప సిట్టింగులందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని ప్రకటించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇకతమకే మళ్లీ టికెట్ వస్తుందని లోలోపల సంబురపడ్డారు. ఇదే సమయంలో గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరిన పలువురు కీలక నేతలు ఇక తమకు టికెట్లు రావని ఆందోళనకు గురవుతున్నారు.
మరో పరీక్షకు రెడీ అవ్వాల్సిందేనా?
తాజాగా పంచాయతీ ఎన్నికల రూపంలో సీఎం కేసీఆర్ మరో పరీక్ష పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. మరో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాచమార్గం వేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈనేపథ్యంలో పంచాయతీ పరీక్షలో ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉత్తీర్ణత సాధించి, వచ్చే ఎన్నికలకు టికెట్లు సాధిస్తారో వేచి చూడాల్సిందే.
Leave a Reply