వారిద్దరూ కలిస్తేనే జగన్ కు మంచిదా?

ఒకవైపు అధికారంలో ఉన్న పార్టీ మిత్రులుగా కలుపుకుని వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటే, ప్రతిపక్ష వైసీపీ మాత్రం అందుకు విరుద్దంగా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్నది జగన్ నిర్ణయంగా తెలుస్తోంది. వామపక్ష పార్టీలను కూడా కలుపుకునేందుకు జగన్ సిద్ధంగా లేరన్నది ఆ పార్టీ వర్గాల నుంచి విన్పిసున్న టాక్. తన పాదయాత్ర ఖచ్చితంగా మెజారిటీ స్థానాలను తెచ్చిపెడుతుందన్న ఆత్మవిశ్వాసంతో జగన్ ఉన్నట్లు కన్పిస్తోంది. అందుకోసమే పొత్తు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని జగన్ పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు.

గత ఎన్నికల్లో మాదరిగానే….

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈసారి బీజేపీతో పొత్తు లేకున్నా పవన్ తో పొత్తు పెట్టుకోవాలన్నది టీడీపీ అధినాయకత్వం ఆలోచన.అయితే గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహకారంతో అందలమెక్కింది. కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే. దీంతో జగన్ గతంలో కంటే పార్టీ బలంగా ఉన్నట్లు నమ్ముతున్నారు. తనకు అందుతున్న సర్వేలు కూడా ఇదే స్పష్టం చేస్తుండటంతో అందుకే జగన్ ఎవరితో పొత్తు ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చారు. ఒంటరిగా పోటీ చేస్తేనే ప్రజల్లో సానుభూతి కూడా పెరుగుతుందన్నది వైసీపీ నేతల అభిప్రాయం. జగన్ ను ఒంటరి చేసి అన్ని పక్షాలూ ఒక్కటయ్యాయన్న ప్రచారం వస్తే అది జగన్ పార్టీకే అనుకూలమని వారు చెబుతున్నారు.

పవన్ ఒంటరిగా పోటీ చేస్తేనే…..

అందుకోసమే జగన్ ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తరచూ రెచ్చగొడుతున్నారు. పవన్ కల్యాణ్ ఏపీలో అభిమానులు, సామాజిక వర్గం అండగా ఉన్నప్పటికీ అవన్నీ గంపగుత్తగా పడవన్నది వైసీపీ అభిప్రాయంగా విన్పిస్తుంది. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఆ ఓట్లలో అధిక భాగం జనసేనకు పడే అవకాశముందని, అదే పవన్ పార్టీ టీడీపీతో కలిసి వెళితే మాత్రం ఆ ఓటు బ్యాంకు తమ దరి చేరుతుందన్న లాజిక్ ను వైసీపీ సీనియర్ నేత ఒకరు బయటపెట్టారు. అందుకే పవన్ కల్యాణ్ కు జగన్ ఇటీవల తరచూ సవాళ్లు విసురుతున్నారు జగన్.

పవన్ టీడీపీతో కలిస్తేనే మంచిదా?

పవన్ కల్యాణ్ పార్టీ, టీడీపీ కలిసి పోటీ చేస్తేనే మంచిదని జగన్ భావిస్తున్నారు. అందుకోసం ప్రతి సభలో టీడీపీ పార్ట్ నర్ గా పవన్ ను జగన్ అభివర్ణిస్తున్నారు. అంతేకాదు అవిశ్వాసం పెట్టాలని పవన్ అన్న వెంటనే జగన్ తాము అవిశ్వాసానికి రెడీ అన్నారు. టీడీపీ మద్దతును కూడా పవన్ కూడ గట్టాలని చెప్పారు. ఇలా పవన్ ను టీడీపీ భాగస్వామిగా ఎప్పటికప్పుడు చూపిస్తూ వారిద్దరూ కలవాలని కోరుకుంటున్నారు జగన్. పవన్ పార్టీతో జత కడితే టీడీపీకి మరో సమస్య కూడా ఉంటుంది. నియోజకవర్గాలు పెంపు లేదు కాబట్టి ఇప్పటికే ఉన్న నేతలతో పాటు జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడు అనేక నియోకవర్గాల్లో అసంతృప్తి తమకు లాభిస్తుందన్నది వైసీపీ అధినేత వ్యూహం. బీజేపీతో పొత్తు ప్రసక్తి లేదని జగన్ చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ ,కమ్మునిస్టులకుకూడా ఏపీలో పెద్దగా పట్టు లేకపోవడంతో వారిని కూడా పక్కనపెట్టి ఒంటరిగానే బరిలోకి దిగాలన్నది జగన్ ఆలోచన. మరి ఎన్నికల నాటికి ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30970 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*