
తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ ఒఖీ తుఫాన్ ధాటికి నిలువెల్లా వణికిపోయాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి భారీ వృక్షాలు నేలకి ఒరిగిపోయాయి. తుఫాన్ భీభత్సనికి ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. లక్ష ద్వీప్ లో 35 బోట్లు గల్లంతు కాగా 95 మంది ఆచూకీ లేకుండా పోయారు. కేరళ తీరంలో సముద్రంలో చిక్కుకున్న 531 మందిని నేవి రక్షించింది. మరికొందరిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాఫ్టర్ల ద్వారా కాపాడాయి.
ఒఖీ నిండా ముంచింది …
తమ ఆరాధ్యదైవమైన అయ్యప్పను దర్శించేందుకు శబరిమలై వెళ్ళిన వేలాదిమంది తుఫాన్ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా కాలినడకన అరణ్యంలో నుంచి వచ్చే స్వాముల పరిస్థితి దయనీయంగా మారింది. భారీ వర్షాలకు ఒక పక్క వృక్షాలు నేలకూలుతుంటే మరో పక్క నడకమార్గం బురదమయంగా మారి ప్రమాదకర పరిస్థితుల్లో వుంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు దర్శనానికి రావొద్దని ట్రావెన్ కొర్ దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. వర్షాలకు పంబా నది ఉదృతంగా ప్రవహిస్తుంది. నదిలో స్నానానికి వెళ్లవద్దని భక్తులకు దేవస్థానం విజ్ఞప్తి చేస్తుంది. శబరిమల ఆలయ పరిసరాలు సైతం దారుణంగా మారిపోయాయి. తుఫాన్ తీవ్రత ఉన్నప్పటికీ ఏపీ తమిళనాడు, కేరళ, కర్ణాటకల నుంచి అయ్యప్ప దర్శనం కోసం భక్తుల రాక ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా పెరుగుతూ ఉండటం దేవస్థానాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. మరో రెండురోజులపాటు భారీ వర్షాలు వుంటాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికలకు అనుగుణంగా అయ్యప్పలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేస్తుంది.
Leave a Reply