విశాఖకు మంత్రి గంటా గుడ్ బై..!

2019 ఎన్నిక‌ల‌కు త‌మ‌కు అనువైన నియోజ‌క‌వ‌ర్గాల వేట‌లో ఉన్నారు ఏపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. తాము కూడా వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేయాల‌ని భావిస్తున్నారు. ఇదే బాట‌లో మంత్రులు కూడా వెళుతున్నారు. ముఖ్యంగా ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా.. మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకునే గంటా శ్రీ‌నివాస‌రావు కూడా నియోజ‌క‌వ‌ర్గం మారాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అంతేగాక ఈసారి ఏకంగా జిల్లానే మార్చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. విశాఖ‌లో రాజకీయ వ‌ర్గాల మ‌ధ్య‌ రోజురోజుకీ విభేదాలు ముదిరిపోతున్నాయి. అంతేగాక విశాఖ‌లో ఆయ‌న హ‌వా నానాటికీ త‌గ్గుతున్న త‌రుణంలో.. ఈ నిర్ణయం తీసుకున్నార‌ని జిల్లాలో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

విశాఖ జిల్లాలో గందరగోళం….

మంత్రులంద‌రికీ ఒక్కో జిల్లా ఇచ్చి.. అక్క‌డి అభివృద్ధితోపాటు రాజ‌కీయాల‌ను ప‌ర్య‌వేక్షించే బాధ్య‌త‌లు అప్ప‌గించారు సీఎం చంద్ర‌బాబు! ప్ర‌స్తుతం విజ‌యన‌గ‌రం జిల్లా ఇన్‌చార్జిగా మంత్రి గంటా శ్రీనివాస‌రావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో విజ‌య‌నగ‌రం జిల్లాపై పూర్తి ప‌ట్టు సాధించిన ఆయ‌న‌.. ఇప్పుడు అదే జిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2019 ఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో గంటా శ్రీ‌నివాస‌రావుకు ఎదురే లేదనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే! విశాఖ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇప్పడు ఆయ‌న రాజకీయ భవిష్యత్తు పై కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

నాలుగు నియోజకవర్గాలు…నాలుగు పార్టీలు…

ఆయ‌న గ‌త నాలుగు ఎన్నిక‌లు చూస్తే నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలు నాలుగు పార్టీలు మారారు. 1999లో అన‌కాప‌ల్లి ఎంపీగా, 2004లో చోడ‌వ‌రం ఎమ్మెల్యేగా, 2009లో అన‌కాప‌ల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి ఎమ్మెల్యేగా ఆయ‌న గెలిచారు. ఇక పార్టీల విష‌యానికి వ‌స్తే టీడీపీ – ప్ర‌జారాజ్యం – కాంగ్రెస్ – టీడీపీ ఇలా మారుతూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం భీమిలి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న చూపు విజయనగరం జిల్లా నెల్లిమర్లపై పడింది. అవకాశం కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో అక్కడినుంచే పోటీకి ఆయన సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. త‌న‌కు కంచుకోట అయిన విశాఖ‌ను వ‌దిలి ఆయ‌న విజ‌య‌న‌గ‌రం వైపు చూడ‌టానికి కూడా కార‌ణాలు లేక‌పోలేద‌ట‌. ముఖ్యంగా ఏపీని ఒక కుదుపు కుదిపిన‌.. విశాఖ భూవివాదాలతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఎఫెక్ట్ తో ఆస్తుల వేలానికి బ్యాంక్‌ సిద్ధం కావడంతో ఆయ‌న ప‌ర‌ప‌తి తగ్గింద‌ట‌. దీనికి తోడు మంత్రి అయ్యన్నకీ ఆయనకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. విశాఖ న‌గ‌రంలో తూర్పు ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబుతోను ఆయ‌న‌కు తీవ్రంగా విబేధాలు ఉన్నాయి. ఈ జిల్లాలో లోకేష్ పెత్త‌నం ఎక్కువ‌వ్వ‌డంతో అది కూడా గంటాకు ఇబ్బందిగా మారింది. దీంతో వీటిని భరించే కంటే పక్క జిల్లాలో పోటీ చెయ్యడమే మంచిది అనే పరిస్థితికి ఆయన వచ్చేశార‌ట‌.

నెల్లిమర్ల అయితే సేఫ్ గా ఉంటుందని….

అందుకే విజ‌య‌న‌గ‌రం జిల్లా నెల్లిమర్ల వైపు చూస్తున్నారని సమాచారం. ఇక్క‌డ‌ ప్రస్తుతమున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామికి వయస్సు మీరడంతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ దక్కే అవకాశం లేదు. ఇక ఆయన కుమారుడిపై ఇప్పటికే షాడో ఎమ్మెల్యేగా ముద్ర పడటంతో ఆయనకు కూడా టిక్కెట్‌ రావడం కష్టమే అంటున్నారు. ఇది కనుక కుదరకపోతే.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి కొత్త నియోజకవర్గంగా భోగాపురం ఏర్పడితే అక్కడి నుంచైనా పోటీ చేయాల‌ని ఆయన చూస్తున్నార‌ట‌. అందుకే ఎక్కువగా ఆయన విజయనగరం రాజకీయాలపై ఫోకస్పెట్టినట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా కూడా గంటా జిల్లా రాజ‌కీయాల‌ను శాసిస్తున్నారు. అక్క‌డ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును కూడా డామినేట్ చేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రి గంటా ఆలోచ‌న‌లు, కోరిక‌లు ఎలా ఉన్నా ఈ నిర్ణ‌యాన్ని సీఎం చంద్ర‌బాబు ఆమోదిస్తారో లేదో వేచిచూడాల్సిందే!!

Ravi Batchali
About Ravi Batchali 25610 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*