
‘వేసవి ఎండలు పెరుగుతున్నాయి, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి. మంచి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చెరువులు నింపుకునేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పని ప్రదేశాల వద్ద తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా అవసరాన్ని బట్టి ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. నరేగా పనుల్లో గుంటూరు జిల్లా వెనకబడి ఉండటం సరికాదన్నారు. మాచర్ల, వినుకొండ, గురజాల నియోజకవర్గాల్లో ఉపాధిపనులు ముమ్మరం చేయాలని సూచించారు.
నీటిభద్రత బాధ్యత జలవనరుల శాఖదే: సీఎం
రాష్ట్రవ్యాప్తంగా అందరికీ నీటి భద్రత బాధ్యత జలవనరుల శాఖదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వివిధ పనులకు సంబంధించి జలవనరుల శాఖకు చెల్లించాల్సివున్న రూ.300కోట్లు బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, మార్కాపూర్ పట్టణాల్లో మంచినీటి ఎద్దడి గురించి ప్రస్తావనకు రాగానే ముఖ్యమంత్రి స్పందిస్తూ జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 2018 కల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
నెలరోజుల్లో లక్షా 50వేల కుంటలు పూర్తిచేయాలి:
ఈవారంలో 10,445 పంటకుంటల తవ్వకం పూర్తయ్యిందని, దీంతో ఇప్పటి వరకు 2,50,929 పంటకుంటలు తవ్వారని, మిగిలిన లక్షా 50వేలు నెలరోజుల్లో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సిమెంటురోడ్ల నిర్మాణం 4,306 కి.మీ పూర్తిచేశారని, టార్గెట్ లో మిగిలిన 700కి.మీ నిర్మాణం వెంటనే పూర్తి చేయాలన్నారు. 2లక్షల వర్మికంపోస్టు పిట్లు లక్ష్యంకాగా, ఈవారంలో 6వేలు పూర్తిచేశారని, ఇప్పటివరకు 92,590 పూర్తయ్యాయని, పనులు ప్రారంభించిన మిగిలిన 53వేలు తక్షణమే పూర్తిచేసేలా శ్రద్ధ చూపాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యం 5లక్షలు కాగా 3లక్షల మరుగుదొడ్ల పనులు ప్రారంభించారని, 1,65,623 పూర్తయ్యాయని అధికారులు వివరించగా, గ్రవుండ్ అయిన వాటిలో మిగిలిన లక్షా 40వేలు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు.
పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి:
మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతల తవ్వకం తాలూకు నిధులు పెండింగ్ ఉన్న విషయం గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు జివి ఆంజనేయులు, రవికుమార్, వర్మ, బోడె ప్రసాద్ ప్రస్తావించగా వెంటనే బకాయి నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పక్కాగృహాల నిర్మాణంపై అధికారులు శ్రద్ద పెట్టాలన్నారు. రాబోయే ఏడాది మరో 4లక్షల ఇళ్లు రానున్న విషయం గుర్తుచేశారు. అంగన్ వాడి భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ, పనులు వేగవంతం చేయాలన్నారు.
Leave a Reply