వైఎస్ రుణం తీర్చుకునేందుకు జగన్ కు బాసటగా…

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో వైఎస్ కు ముఖ్య అనుచరులు, స్నేహితులుగా ఉన్నవారంతా ఒక్కటవుతున్నారు. వైఎస్ జగన్ కు అండగా నిలబడాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎలాగైనా గెలిపించి వైఎస్ పట్ల తమ విధేయతను ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. వైఎస్ పీసీసీ అధ్యక్షుడిగా…ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనకు అనేకమంది అనుచరులు ఉండేవాళ్లు. ఆయన గీసిన గీత దాటరు. అలాగే ఆయన కూడా వారికి అదే విధంగా ప్రాధాన్యత ఇచ్చేవారు. కార్పొరేటర్ గా గెలవని వారిని సయితం ఎమ్మెల్యేలను చేసి వైఎస్ తనను నమ్ముకున్న వారికి న్యాయం చేశాడని ఇప్పటికీ అనేకమంది బహిరంంగానే చెబుతుంటారు. వైఎస్ బతికున్నరోజుల్లో అనేక పదవులు పొందిన వారు మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కొంత తటస్థంగా ఉన్నారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ లోనే ఉన్న జగన్ తర్వాత బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. అయితే జగన్ కొంత దూకుడుగా ఉండటంతో వీరంతా ఆయనకు, ఆయన పార్టీలో చేరలేదు. కొందరు చేరినా మధ్యలోనే మనస్పర్థలు వచ్చి వెళ్లిపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో జగన్ కు పూర్తి మద్దతివ్వాలని, నైతికంగా జగన్ కు అండగా నిలవాలని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ వైఖరి ఎలా ఉన్నప్పటికీ వైఎస్ కోసమైనా వైసీపీకి అండగా నిలవాలని వీరంతా ఒక్క తాటిపైకి వచ్చారని తెలుస్తోంది. ఇందులో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

కొందరు త్వరలోనే పార్టీలో చేరిక…..

ముఖ్యంగా మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, సబ్బం హరి తదితరులు జగన్ కు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. అధికార తెలుగుదేశం పార్టీని ఇప్పటినుంచే ఇరకాటంలో పెట్టేందుకు వారు సమాలోచనలు చేశారు. ముఖ్యంగా కేవీపీ డైరెక్షన్ లోనే వీరంతా నడుస్తున్నట్లు సమాచారం. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య కాలంలో రోజుకో ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, పట్టీసీమ అవినీతి, పురోషత్తం పట్నం లిఫ్ట్ ఇరిగేషన్, విశాఖ భూకుంభకోణం, అమరావతి రాజధాని నిర్మాణం వంటి అంశాలను వీరు ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్ కు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో నేరుగా చేరకపోయినా పరోక్షంగా జగన్ కుమద్దతివ్వడం, చంద్రబాబును ఇబ్బందుల్లో పడేయడమే లక్ష్యంగా వీరు ముందుకు వెళ్లనున్నారు. వీరిలో కొంతమంది నేరుగా వైసీపీలోకి చేరే అవకాశం కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ టీంలో ఉన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్, మల్లాది విష్ణు వంటి వారు అతి త్వరలోనే పార్టీలో చేరే అవకాశముంది. ఈసారి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్నదే వీరి ప్రధాన ఉద్దేశంగా కన్పిస్తోంది. చూద్దాం… వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో.

Ravi Batchali
About Ravi Batchali 22373 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

1 Comment on వైఎస్ రుణం తీర్చుకునేందుకు జగన్ కు బాసటగా…

Leave a Reply

Your email address will not be published.


*