
విశాఖలో గురువారం జరిగిన వైసీపీ మహాధర్నా టీడీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ముఖ్యంగా అధినేత చంద్రబాబుకు ఈ ధర్నా చికాకు తెప్పించింది. వైసీపీ నేతలు ధర్నా చేసి వెళ్లిపోగానే అక్కడ స్థానిక నేతలు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. అవినీతీ మనుషులతో ఇక్కడ అపవిత్రమైందంటూ శుద్ధిచేశారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదక ను చూసి బిత్తరపోయారట. విశాఖలో టీడీపీ నేతలపై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఈ నివేదికలో పేర్కొనడం విశేషం. విశాఖ భూకుంభకోణంలో కొందరు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సిట్ వేశారు చంద్రబాబు. కలెక్టర్ కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ…దాన్ని సిట్ తో సర్ది చెప్పాలనుకున్నారు చంద్రబాబు. కాని విశాఖలో జరిగిన వైసీపీ మహాధర్నాకు పెద్దయెత్తున సభకు హాజరైన జనంలో భూ బాధితులు కూడా ఉన్నట్లు ఇంటలిజెన్స్ నివేదిక పేర్కొంది. తమ భూములు కోల్పోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో వారు జగన్ వస్తున్నారని తెలిసి అక్కడకు వచ్చారని ఇంటలిజెన్స్ అధికారులు నివేదిక అందించడంతో చంద్రబాబు అవాక్కయ్యారు.
అయ్యన్న తో ఇమేజ్ డామేజీయేనా?
సాధారణంగా జగన్ సభకు భారీ ఎత్తునే జన సమీకరణ జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలను తరలిస్తుంటారు. విశాఖలో కూడా అదే జరిగి ఉంటుందని తొలుత భావించారు టీడీపీ నేతలు. అయితే ఎక్కువ మంది భూ బాధితులు ఒకేసారి రావడంతో అధికారపార్టీని ఊపిరి సలవనివ్వడం లేదు. భూ బాధితులతో పాటుగా విశాఖ ప్రజలు కూడా రావడం వారి ఆందోళనకు మరింత కారణమైంది. దీంతో విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడి ఫైరయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. భూ కుంభకోణంలో ఎవరిపేర్లున్నా సహించబోనని కూడా ఆయన హెచ్చరించారని తెలుస్తోంది. విశాఖలో భూ కుంభకోణంపై ఆ ప్రాంత ప్రజలు అధికారపార్టీపై అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబుకు తెలియడంతో విశాఖ నేతలు కూడా నష్టనివారణలో పడిపోయారు. ముఖ్యంగా భూ కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు విన్పిస్తున్న ఎమ్మెల్యే ఒకరు హుటాహుటిన అమరావతికి బయలుదేరి వచ్చి చంద్రబాబు అపాయింట్ మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే మంత్రి అయ్యన్న వ్యాఖ్యలు కూడా పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసిందని నివేదికలో పేర్కొన్నారు. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ ధర్నా అధికార పార్టీలో కలవరం రేపిందనే చెప్పొచ్చు.
Leave a Reply