
వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ఒకవైపు నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తుంటే వైసీపీ సీనియర్ నేతలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. వారే అభ్యర్థులను ఖరారు చేయడం వివాదాస్పదంగా మారింది. తమ సీనియారిటీని చూసి జగన్ తాము చెప్పిన వారికే టిక్కెట్ ఇస్తారన్న నమ్మకం కావచ్చు. తమ మాటకు జిల్లాలో ఎదురు లేదని కాబోలు. మొత్తం మీద ఎన్నికలు ఇంకా రెండేళ్లు ముందుగానే అభ్యర్థులను కొందరు సీనియర్ నేతలు ప్రకటిస్తున్నారు. ఇది జగన్ కు తలనొప్పిగా మారింది. దీనిపై జగన్ కు పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఒక పక్క సర్వే నిర్వహిస్తుంటే నియోజకవర్గానికి అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ఆశావహులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు పెద్దయెత్తున పోటీ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు నుంచి ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. దీన్ని గమనించే జగన్ ఇన్ ఛార్జితో పాటు కో-ఆర్డినేటర్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో నియోజకవర్గానికి ఇద్దరు నేతలు ఇప్పుడు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతల వ్యాఖ్యలతో టిక్కెట్ కోసం పోటీ పడుతున్న నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ వద్దనే తేల్చుకుంటామని హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారు.
టిక్కెట్లు ఖరారు చేస్తున్న సీనియర్లు……
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ టిక్కెట్ ను తిలక్ కు కేటాయిస్తామంటూ వైసీపీ సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు బహిరంగ వేదికపై ప్రకటించడం వివాదమయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా జరిగిన సభలోనే ఈ ఇద్దరు సీనియర్ నేతలు టెక్కలి టిక్కెట్ ను ఖరారు చేశారు. దీంతో ఆ సభకు వచ్చిన మిగిలిన నేతలు అవాక్కయ్యారు. టెక్కలి అంటే మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నిర్వహించింది. మరోసారి నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ధర్మాన, తమ్మినేనిలు తిలక్ కే పార్టీ టిక్కెట్ అని ప్రకటించడంతో వైసీపీ నేతలు వారి అనుచరులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీనిపై ఇప్పటికే జగన్ కు కూడా ఫిర్యాదు చేశారు. పీకే టీంతో తమకు సంబంధం లేదంటూ జిల్లాలోనే టిక్కెట్లు ఖరారు చేస్తుంటే ఇక అధిష్టానం ఎందుకన్న ప్రశ్న కూడా వస్తుంది. దీంతో జగన్ కూడా దీనిపై ధర్మాన ప్రసాదరావును, తమ్మినేని సీతారాంను వివరణ కోరినట్లు తెలిసింది. మొత్తం మీద సీనియర్ నేతలు వైసీపీలో తమ మాట చెల్లుబాటవుతుందనే నమ్మకంతోనే ఈ ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాగైతే ఇక పీకే ఎందుకు? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.
Leave a Reply