
తనకు పంగనామాలు పెట్టిన శిష్యుడిపై పగ తీర్చుకోవాలనుకుంటున్నారు ఈనేత. రాజకీయంగా జన్మనిచ్చిన తనను కాదని పార్టీని వదిలి వెళ్లిపోయిన శిష్యుడిని వదలకూడదని నిర్ణయించుకున్నారు ఈ సీనియర్ నేత. ఆయనే జానారెడ్డి. సీఎల్పీ నేతగా, రాష్ట్రంలోనే అనుభవమున్న నేతగా, అనేక పదవులను అధిష్టించిన లీడర్ గా పేరున్న జానారెడ్డి ఈ విషయంలో మాత్రం గట్టి పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. జానారెడ్డి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అదే సందర్భంలో తన శిష్యుడైన భాస్కరరావుకు మిర్యాలగూడ టిక్కెట్ ఇప్పించారు.భాస్కరరావుది నల్లగొండ జిల్లా కాకపోయినప్పటికీ జానా తో ఉన్న పరిచయం, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన మిర్యాలగూడలో సెటిలర్లను చేసింది. గత ఎన్నికల్లో జానారెడ్డి ప్రభావంతోనే భాస్కరరావు కాంగ్రెస్ తరుపు నుంచి గెలిచారు. కాని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి గురువును వీడి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. భాస్కర్ రావు పార్టీ వీడివెళ్లడాన్ని జానా జీర్ణించుకోలేకపోయారు. కొద్దిరోజులు అదే ఆలోచనలతో గడిపారు. తాను ఇంత చేరదీస్తే నమ్మక ద్రోహానికి పాల్పడి వెళ్లిపోయాడని జానారెడ్డి సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు కూడా.
కుమారుడిని బరిలోకి దింపి…..
అయితే వచ్చే ఎన్నికల్లో భాస్కరరావుపై గట్టి పోటీ పెట్టి ఓడించేందుకు జానా సిద్ధమవుతున్నారట. అందుకోసం తన కుమారుడైన రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని జానా గట్టిగా భావిస్తున్నారు. ఇప్పటికే రఘువీర్ రెడ్డి మిర్యాలగూడలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన ఇప్పటినుంచే అక్కడ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలన్న సామెతగా మిర్యాలగూడ నుంచి తన కుమారుడు రఘువీర్ ను రాజకీయం అరంగేట్రం చేయించడం, మరోవైపు తన శిష్యుడిగా చేసుకుని వంచించి వెళ్లిపోయిన భాస్కరరావును ఓడగొట్టడం. ఇదే జానారెడ్డి ముందున్న కర్తవ్యమని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా జానారెడ్డికి మిర్యాలగూడలో పేరుండటంతో కొడుకు విజయానికి మిర్యాలగూడ నియోజకవర్గమే కరెక్ట్ అని ఆయన నమ్ముతున్నారు. మొత్తం మీద జానారెడ్డి తన శిష్యుడిపై కసి తీర్చుకోవడానికి ప్లాన్ సిద్ధం చేశారన్నమాట.
Leave a Reply