
రాజకీయాల్లో కప్పదాటుళ్లు.. గోడ దూకుళ్లు కామన్ అయిపోయాయి. అయితే, ఇలాంటి వాళ్లకు సరైన విధంగా బుద్ధి చెప్పాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో తన పార్టీ వైసీపీ నుంచి గెలుపొంది.. జంప్ చేసిన వారికి సరైన పోటీ ఇచ్చే వారిని జగన్ ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్.. వైసీపీని గెలిపించే గెలుపు గుర్రాల వేట కూడా సాగిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో ఉన్న వైసీపీ అధినేత.. కొత్తగా పార్టీలో చేరేవారికి రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తున్నారు.
అందరి చూపూ వైసీపీ వైపే……
మొత్తంగా ఈ పరిణామంతో ఫిదా అవుతున్నవారు.. టీడీపీలో గెలిచే అవకాశం ఉండి కూడా టికెట్ రాదని భావిస్తున్నవారు.. చంద్రబాబుపై అసంతృప్తులు మొత్తంగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇలా చేరుతున్నవారిలో గట్టిగా పోటీ ఇచ్చేవారిని జగన్ ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలుపొందిన సుజయ్ కృష్ణరంగారావు. తర్వాత టీడీపీ అదినేత చంద్రబాబు విసిరిన బాణానికి పడిపోయాడు. ఇప్పుడు మంత్రిగా చలామణి అవుతున్నాడు. ఈ క్రమంలో వచ్చేఎన్నికల్లో సుజయ్‌కు దీటైన వ్యక్తిని రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు.
మూడుసార్లు గెలిచిన…..
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఇదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, టీడీపీ నాయకుడు శంబంగి చిన అప్పలనాయుడును జగన్ పార్టీలో చేర్చుకున్నారు. జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరుగుతున్న విషయం తెలసిందే. ఈ క్రమంలో చిన అప్పలనాయుడు వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి వచ్చి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గానికి అప్పలనాయుడు మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
టీడీపీలో కూడా విప్ గా పనిచేసి…..
1983 ఇండిపెండెంట్‌గా 1985, 1994లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పలనాయుడు 1994లో టీడీపీ విప్‌గా పనిచేశారు. అప్పలనాయుడితో పాటు మరికొందరు స్థానిక నేతలు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ పరిణామాలు మొత్తంగా సుజయ్ కృష్ణ రంగారావును మంత్రి బొత్స, జగన్ ప్రత్యేకంగా టార్గెట్ చేసేందుకే అని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో సుజయ్ పోటీ పడినా.. గత ఎన్నికల్లో వైసీపీ అండతోను, జగన్ ఫేస్ వాల్యూతోనూ గెలిచారని, ఇప్పటికే ప్రజల్లో ఆయన వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
సుజయ్ పై అసంతృప్తి……
అటు అధికార పార్టీలోనూ సుజయ్‌కు పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదు. ఆయన మంత్రిగా ఉన్నా కూడా జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలే పట్టించుకోవడం లేదు. ఇక పార్టీ నాయకత్వం కూడా ఆయన అంచనాలకు అనుగుణంగా పని చేయడం లేదన్న అసంతృప్తితో ఉంది. పైగా గతంలో సుజయ్‌ను ఓడించేందుకు కృషి చేసిన వారితో ఆయన కలిసి పనిచేయాల్సి రావడంతో కూడా ఆయన ఫీల్ అవుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి అప్పలనాయుడు ఎంతో ఉప యోగ పడతారని అంటున్నారు పరిశీలకులు. మరి జగన్ వ్యూహం ఏంటో చూడాలి.
Leave a Reply