
విశాఖకు చెందిన కీలక నేత, సామాజిక వర్గంలో పట్టున్న నేత సబ్బం హరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయన టీడీపీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. సబ్బం హరిని, విశాఖ రాజకీయాలను విడదీసి చూడలేం. సబ్బంహరి మేయర్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎదగడం వెనుక ఆయన వ్యక్తిగత కృషి ఉంది. సొంత ఇమేజ్ కూడా ఉంది. అందుకోసమే పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన సబ్బం హరి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. రాష్ట్ర విభజనను అన్యాయంగా కాంగ్రెస్ చేసిందని ఆరోపిస్తూ ఆయన బయటకు వచ్చేశారు. విభన తర్వాత ఆయన వైసీపీలో చేరారు. అయితే వైసీపీ అధినేత జగన్ కు, సబ్బం హరికి మధ్య మనస్పర్ధలు రావడంతో వైసీపీని వీడారు. సబ్బం హరి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగానని సబ్బంహరి చెప్పుకుంటారు.
టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లేనా?
అయితే వైసీపీని వీడిన తర్వాత సబ్బం హరి ఏ పార్టీలో చేరతారన్న క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్, వైసీపీలో చేరే అవకాశం లేదు. బీజేపీ, టీడీపీల్లో చేరే అవకాశాలే ఉన్నాయి. గత కొంతకాలంగా సైలెంట్ గాఉన్న సబ్బం హరి నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మొదటిసారి పెదవి విప్పారు. ఆయన చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు. చంద్రబాబు అనుభవం, రాజకీయ చతురత నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పనిచేసిందని ఆయన మీడియా ముందు చెప్పడం విశేషం. దీన్నిబట్టి చూస్తే సబ్బం హరి టీడీపీలోకి వెళతారన్న వాదన బలంగా విన్పిస్తోంది. ఇటీవల కాలంలో కొందరు టీడీపీ నేతలు కూడా సబ్బం హరితో సమావేశమయినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సబ్బం హరి రాకను కోరుకుంటున్నారు. హరి రాకతో విశాఖలో పార్టీ మరింత బలం పెంచుకుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే సబ్బం హరి టీడీపీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Leave a Reply