హస్తినలో జగన్ హల్ చల్

ఆంధ్రప్రదేశ్ లో జరుగతున్న పరిణామాలను వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో అన్ని పార్టీల నేతల వద్దకు తీసుకెళ్తున్నారు. ఏపీలో ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్న విషయాన్ని జగన్ జాతీయ స్థాయిలో హైలెట్ చేస్తున్నారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన జగన్ ఫిరాయింపులను చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, రాజ్యాంగ విరుద్ధంగా తమ పార్టీ ఎమ్మెల్యేలను 21మందిని టీడీపీలోకి తీసుకోవడంపై తప్పుపట్టారు. ఈరోజు జగన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ను కలిశారు. ప్రజాస్వామ్యాన్ని నిట్టనిలువునా ఖూనీ చేస్తున్న చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి రావాలని ములాయంను కోరినట్లు తెలిసింది. దాదాపు జగన్ ములాయం తో అరగంట పాటు సమావేశమై చర్చించారు.

వివిధ పార్టీల నేతలతో సమావేశాలు….

శుక్రవారం జగన్ సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కూడా కలిసి ఏపీలో జరిగిన రాజ్యాంగ ఉల్లంఘనను వివరించారు. తర్వాత ఎన్సీపీ అధినేత శరత్ పవర్ ను కూడా జగన్ కలిశారు. హస్తినలోనే మకాం వేసిన జగన్ చంద్రబాబు ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులను అన్ని పార్టీల అధినేతల దృష్టికి తీసుకొస్తున్నారు. దీని వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదముందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అనర్హత పిటీషన్లను తాము స్పీకర్ కు ఇచ్చినా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్నికూడా నేతల దృష్టికి జగన్ తీసుకు వెళుతున్నారు. స్పీకర్, గవర్నర్, ముఖ్యమంత్రి ముగ్గురూ కలిసి ప్రజాస్వామ్యానికి పాతరేశారని జగన్ ఆరోపిస్తున్నారు. తనపై కేసులు ఉన్నాయంటూ చంద్రబాబు అండ్ కో తప్పుడు ప్రచారానికి దిగుతుందని, అవి ఏమాత్రం నిలబడలేని కేసులని ఆయన అభిప్రాయపడ్డారు. తనను అన్యాయంగా 16 నెలలు జైలులో ఉంచారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద హస్తినలో జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తూ అన్ని పార్టీల గడపలూ తొక్కుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 20344 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*