
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వరం పెంచుతున్నారు. అనంతపురంలోజరిగిన సభలోనూ ఆయన ఇదే అంశాన్ని ప్రస్తావించారు. హోదా తాను ఎన్నడూ వద్దనలేదన్న ఆయన కేంద్ర ప్రభుత్వం, 14వ ఆర్థిక సంఘం తనను తప్పుదోవపట్టించిందన్న రీతిలో మాట్లాడుతున్నారు. 11 రాష్ట్రాలకు హోదా పొడిగించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కూడా హోదా ఇవ్వాల్సిందేనంటున్నారు. ఇందులో తన తప్పేమీ లేదని చెప్పుకొస్తున్నారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా రాదని చెప్పడం వల్లనే తాను నమ్మానని చెప్పి నెపాన్ని కేంద్రం మీదకు నెట్టే ప్రయత్ని చేస్తున్నారు.
పరోక్షంగా వైసీపీపై విమర్శలు….
అయితే ఇదే సమయంలో ప్రత్యేక హోదా నినాదంతో కొందరు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించాలని చూస్తున్నారని కూడా చంద్రబాబు అంటున్నారు. అంటే వైసీపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆందోళనలు చేయకుండా శాంతియుతంగా హోదా కోసం పోరాడాలని చంద్రబాబు చెప్పడాన్ని పలువరు తప్పుపడుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి ఎగిసిపడినందునే వారు రాష్ట్రాన్ని సాధించుకున్నారని, చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగితే పెట్టుబడులు రావని మళ్లీ కొత్త నాటకానికి తెరలేపుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.
కేంద్రం చెబితే నమ్మేస్తారా?
ప్రత్యేక హోదా రాదని కేంద్రం, 14వ ఆర్థిక సంఘం చెబితే అలా గుడ్డిగా ఎలా నమ్మారని కూడా కొందరు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి చంద్రబాబుకు హోదా గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు. కేంద్రంతో తెగదెంపులు చేసుకోకుండా అంటకాగుతూ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తే ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆరోజు కేంద్ర ప్రభుత్వంలో చిరంజీవి, పళ్లంరాజు, పురంద్రీశ్వరి, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మిలు తమ పదవులు వీడకపోవడం వల్లనే రాష్ట్రం విడిపోయిందన్న విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా సుజనాచౌదరి, అశోక్ గజపతి రాజు పదవులను పట్టుకుని వేలాడమేంటని నిలదీస్తున్నారు.
కేంద్రంలో భాగస్వామిగా ఉంటూనే…..
చంద్రబాబు కొత్త తరహా పోకడలు విచిత్రంగా ఉన్నాయంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో తనను తిట్టవద్దంటున్నారు. కేంద్రాన్ని వెళ్లి అడగాలంటున్నారు. రాత్రింబవళ్లూ తనను తిడితే ప్రయోజనమేంటని చంద్రబాబు అనడాన్ని కూడా తప్పు పడుతున్నారు. ప్రత్యేక హోదాను కోల్డ్ స్టోరేజీ లోకి నెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా? ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా? అని చంద్రబాబు అన్న మాట నిజం కాదా? ఆరోజు ప్యాకేజీ కోసం పాకులాడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందునే ఈరోజు రాష్ట్ర అభివృద్ధి జరగడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు నచ్చచెప్పలేక…దాన్ని పూర్తిగా అందుకోలేక సతమతమవుతున్నట్లు కన్పిస్తోంది. మరి చంద్రబాబు మాటలను ఏపీ ప్రజలు విశ్వసిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Leave a Reply