‘ఆయువు’ పోసింది ఆమె
నువ్వు పరాయి దానివి అన్నారు. అధ్యక్షపదవికి పనికి రావు అన్నారు. గుంపు కట్టారు. గూడుపుఠాణి చేశారు. అయినా ఆమె గెలిచింది. పార్టీని గెలిపించింది. రాజకీయ ఓనమాలు తెలియకుండానే రాజ్యాన్ని శాసించింది. ప్రభుత్వ బాధ్యతలు చేపట్టకుండానే పట్టు సాధించింది. ప్రపంచంలోనే ప్రభావ శీల మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. 132 సంవత్సరాల కాంగ్రెసు పార్టీలో సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా రికార్డు సృష్టించింది. పుట్టి పెరిగిన దేశాన్ని, కనిపెంచిన అమ్మానాన్నను, అయిన వాళ్లను వదిలేసి రాజీవ్ చేయి పట్టుకుని బారత్ లో అడుగు పెట్టిన సోనియా దేశానికే మార్గనిర్దేశం చేయడం ఆధునిక భారతంలో ఒక చరిత్ర. రాజకీయాల్లో మునిగితేలిన ప్రథమకుటుంబంలో పెద్ద కోడలిగా ఉన్నప్పటికీ తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించడం ఆమెకే చెల్లింది. రాజకీయాల పొడగిట్టని అచ్చమైన గృహిణిగా 30 ఏళ్ల పాటు కుటుంబ బాధ్యతలనే నిర్వర్తించారు సోనియా. అత్తమ్మను, భర్తను రాజకీయాల్లోనే కోల్పోయిన సోనియాకు ఈ రంగంలో సాధకబాధకాలు, చావుకు ఎదురీదాల్సిన పరిస్థితులు క్షుణ్ణంగా తెలుసు. తల్లిగా తన బాధ్యత పిల్లలైన రాహుల్, ప్రియాంకలను చూసుకోవడమే . అందుకే తొలిదశలో పార్టీ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కానీ కోట్లాది ప్రజల ఆకాంక్షల ప్రతిరూపమైన పార్టీ పతనావస్థకు చేరుకుంటోందన్న దశలో కొన్ని త్యాగాలకు సిద్ధపడే సోనియా కాంగ్రెసు అధ్యక్షబాధ్యతలు స్వీకరించారు.
అమ్మ నుంచి అధినేత్రిగా...
భర్త, పిల్లలు ఇదే ఆమె ప్రపంచం . 1968లో రాజీవ్ ను పెళ్లాడి అత్తారింటికి వచ్చింది మొదలు 1998 వరకూ కూడా సోనియా సర్వస్వం కుటుంబమే. 1980 లలో సంజయ్ గాంధీ మరణించేవరకూ తన భర్త రాజీవ్ ను సైతం రాజకీయాలవైపు వెళ్లకుండా కాపాడుకొంది ఆమె. ఉక్కుమహిళ ఇందిర పెద్ద కుమారుడైనప్పటికీ రాజీవ్ సాధారణ పైలట్ గా నిరాడంబరంగా మిగిలిపోవడానికి ప్రదాన కారణం సోనియానే. సంజయ్ మరణం తర్వాత ఇందిర సూచనల మేరకు రాజీవ్ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఇందిర హత్య తర్వాత రాజీవ్ ప్రధాని కావాల్సి వచ్చింది. భర్త ప్రధాని అయినప్పటికీ పదవులు, రాజ భోగాలపై ఆమెకేనాడూ మక్కువ లేకపోవడంతో పాలన వ్యవహారాలకు సోనియా దూరంగానే ఉన్నారు. భర్తను కూడా అవే రాజకీయాలు బలిగొన్నాయి. గుండె నిబ్బరం చేసుకుని పిల్లల పెంపకంపై దృష్టి పెట్టారు. 1991లో ఆమెను రాజీవ్ స్థానంలో చూడాలని కాంగ్రెసు శ్రేణులు కోరుకున్నప్పటికీ వైముఖ్యమే ప్రదర్శించారు. పీవీ నరసింహారావు సంస్కరణలు, బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత కాంగ్రెసు పతనావస్థకు చేరుకుంది. వరసగా పరాజయ పరంపర మొదలైంది. పార్టీ ఏమవుతుందో తెలియని స్థితికి చేరుకుంది. ఈ సంక్షోభ సమయంలో ఇందిర,రాజీవ్ ల వారసత్వాన్ని స్వీకరించి పార్టీని పరిరక్షించడం తన బాధ్యతగా గుర్తించిన సోనియా కాంగ్రెసు అధ్యక్ష కర్తవ్యాన్ని చేపట్టారు.
అత్తమ్మను అధిగమించి...
చిన్ననాటి నుంచి రాజకీయాలను చూస్తూ పెరిగిన ఇందిర భారత రాజకీయాల్లో ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్నారు. సిండికేట్ రాజకీయాలను తిప్పికొట్టి కాంగ్రెసు పార్టీపై నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని సుస్థిర పరిచారు. 20 సూత్రాల పథకం, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి విప్లవాత్మక సంస్కరణలతోపాటు గరీబీ హటావో వంటి నినాదాలతో అట్టడుగు వర్గాల సంక్షేమ, దేశ ప్రగతి రథ సారథిగా దేశ రాజకీయ ముఖచిత్రంపై చెరిగిపోని ముద్ర వేశారు. రాజకీయాల పొడగిట్టని సోనియా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా వైఫల్యం చెందుతారని చాలా మంది ఆశించారు. మూంగీ గుడియా గా తొలి దశలో ఇందిరను సైతం కాంగ్రెసు వృద్ధ తరం భావించి అపహాస్యం పాలు చేయాలని చూసింది. కానీ తన పరిపాలన తీరుతో, వ్యూహరచనతో, ఎత్తుగడలతో సిండికేట్ నాయకుల ఎత్తుగడలను తిప్పికొట్టి తన రాజకీయచాణక్యాన్ని చాటిచెప్పారు ఇందిర. అనుభవం లేకపోయినా అత్తమ్మ అడుగుజాడల్లోనే నడిచిన సోనియా తనకు ఎదురుతిరిగిన శరద్ పవార్, తారిఖ్ అన్వర్, సంగ్మా వంటి వారి ప్రతిఘటనకు సరైన బదులే చెప్పారు. బలమైన పక్షంగా కాంగ్రెసును తీర్చిదిద్దారు. 1998లో సంక్షోభ సమయంలో బాద్యతలు చేపట్టి 1999 లో ప్రధానప్రతిపక్ష నాయకురాలిగా పార్లమెంటులో రంగప్రవేశం చేశారు. ముక్కు సూటిగా వ్యవహరించడం, కఠిన నిర్ణయాలకు వెనుకాడకపోవడం, పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తిని నింపడం త్రిముఖ లక్ష్యాలుగా పనిచేశారు. వాజపేయి వంటి సర్వజనామోద నాయకుడు ప్రధాని గా ఉన్న ఎన్డీఏ కూటమినే 2004 లో కంగు తినిపించారు. కాంగ్రెసును గెలిపించుకున్నారు. అంతవరకూ సోనియాను ఆషామాషీ నేతగా భావించిన ప్రత్యర్థులకు ఆమె శక్తి సామర్థ్యాలు తెలిసి వచ్చాయి. రెండు పర్యాయాలు పార్టీని కేంద్రంలో గెలిపించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసు పార్టీకి పునర్వైభవం సాధించి పెట్టారు. అత్తమ్మను అధిగమించి 19 ఏళ్ల పాటు పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. క్రిటికల్ రాజకీయ నిర్ణయాల్లో ఇందిర కంటే కూడా నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారనే పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వంటి రాజకీయ సమస్యను పరిష్కరించడం సోనియా దృఢ వైఖరికి నిదర్శనం. పర్యవసనాల గురించి ఆలోచించకుండా శాశ్వత పరిష్కార దిశలో నిర్ణయం తీసుకోవడం సోనియాకే చెల్లిందని చెప్పాలి.
సంస్కరణ వాది.. సంక్షేమ సారథి
సోనియా తన కుటుంబమనే చిన్న ప్రపంచాన్నే చూసినప్పటికీ అవగాహన పరిధి విస్తృతమైనది. అందుకే యూపీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత సంస్కరణలకు పెద్ద పీట వేశారు. ఒకవైపు వామపక్షాలు వెనక్కి లాగుతున్నా ముందడుగే వేశారు. ఆర్థికవేత్త మన్మోహన్సింగ్ ను ప్రధానిగా ఎంచుకోవడంలోనే తన పంథాను ఆమె స్పష్టంగా తెలియచెప్పారు. నేషనల్ అడ్వయిజరీ కమిటీ సారథిగా ప్రభుత్వానికి మార్గ నిర్దేశం చేశారు. ప్రజలకు ప్రభుత్వ కార్యకలాపాలను తెలుసుకునే హక్కును చట్టబద్దం చేసే సమాచార హక్కు చట్టం, గ్రామీణ పేదలకు పని హక్కు కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహారభద్రత వంటివి సోనియా ముందు చూపునకు సంకేతాలు. దేశ అవసరాల దృష్ట్యా అమెరికాతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చినప్పుడు వామపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ వెనకడుగు వేయలేదు. కేవలం రాజకీయ పరిణామాలకు భయపడకుండా దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేశారు. సోనియా ప్రభుత్వానికి బ్యాక్ సీటు డ్రైవింగ్ చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ , ఒకరకంగా చెప్పాలంటే మన్మోహన్ వంటి మౌనయోగికి మద్దతుగా , రాజకీయ అండగా నిలిచారనే చెప్పాలి. అందువల్లనే ప్రభుత్వం పదేళ్లపాటు మనుగడ సాగించగలిగింది.
అధికారం హక్కు కాదు..బాధ్యత
అధికారం హక్కు కాదు, బాధ్యత అనే రాజకీయ స్పృహ కలిగిన వ్యక్తి సోనియా. నిజానికి ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెసు రాజకీయాల్లో విస్త్రుత సంకీర్ణ ప్రభుత్వ శకానికి సోనియానే ఆద్యురాలిగా చెప్పాలి. పీవీ నరసింహరావు హయాంలో అనేక పక్షాలను కలుపుకోవడం, మైనారిటీ ప్రభుత్వాన్ని నెలకొల్పడం సాగింది. కానీ దేశ రాజకీయాలపై పెద్దగా అవగాహన లేని సోనియా 15 పక్షాల సంకీర్ణమైన యూపీఏ కి నేత్రుత్వం వహించారు. 2004లో కాంగ్రెసు ఎక్కువ సీట్లు తెచ్చుకున్న పెద్ద పార్టీగా నిలిచినప్పుడు 15 రాజకీయ పార్టీలు ఆమె ప్రధాని కావాలని ఆశించాయి. వామపక్షాలు సైతం ఇందుకు మద్దతు పలికాయి. అయినప్పటికీ ఆమె అధికారానికి దూరంగానే ఉన్నారు. తనకంటే కూడా దేశ ఆర్థిక రంగంపై అవగాహన ఉన్న మన్మోహన్ అయితే నే పదవికి న్యాయం చేయగలరని భావించి అతనిని ఎంపిక చేశారు. సరైన స్థానంలో సరైన వ్యక్తిని ఎంపిక చేయడమే నాయకత్వ సామర్థ్యం . ఈ విషయంలో సోనియా నూటికి నూరు పాళ్లు విజయం సాధించారు. అంతేకాదు సరైన సమయంలో తర్వాత తరానికి పగ్గాలు అప్పగించడమూ ప్రాప్త కాలజ్ఝతే. రాహుల్ ను కాంగ్రెసు పీఠంపై కూర్చోబెట్టడం ద్వారా ఆ విషయంలోనూ సోనియా తన పరిణతిని నిరూపించుకున్నారు.
ఎడిటోరియల్ డెస్క్
సోనియా రాజకీయప్రస్థానం పార్ట్ -2 రేపు చూద్దాం....
- Tags
- సోనియా గాంధీ