ఏబీసీడీ మూవీ రివ్యూ

బ్యానర్: మధుర ఎంటర్టైన్మెంట్
నటీనటులు: అల్లు శిరీష్, రుష్కర్, నాగబాబు, మాస్టర్ భరత్, కోట శ్రీనివాస్ రావు,
మ్యూజిక్ డైరెక్టర్: జుద సందే
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని
డైరెక్టర్: సంజీవ్ రెడ్డి

తండ్రి అల్లు అరవింద్ బడా ప్రొడ్యూసర్, అన్న అల్లు అర్జున్ స్టార్ హీరో. కానీ అల్లు శిరీష్ మాత్రం ఇంకా స్టార్ రేంజ్ అందుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. కొన్ని ఫీల్ గుడ్ మూవీస్ చేసినా… హీరోగా మాత్రం స్టాండ్ తీసుకోలేక ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. ఎంతగా బ్యాగ్రౌండ్ ఉన్నా లక్కు, దానితో పాటుగా టాలెంట్ కూడా చాలా అవసరం. మరి గౌరవం, కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి సినిమాలతో హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకున్న అల్లు శిరీష్ కి ఆ సినిమాలు యావరేజ్ నే మిగిల్చాయి కానీ హిట్స్ ఇవ్వలేకపోయాయి. ఇక ఏడాదిన్నరగా ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యని ఈ అల్లు వారి హీరో అల్లు శిరీష్ ఇప్పుడు ఏబీసీడీ అనే మలయాళ సూపర్ హిట్ సినిమాని తెలుగులో సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేసాడు. ఏబీసీడీ అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే క్యాప్షన్ తో రీమేక్ చేసిన ఈ చిత్రంతో హిట్ కొట్టాలని శిరీష్ తహతహాలాడుతున్నాడు. ఇక మూడు నెలల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో విడుదల వాయిదా పడినా.. ప్రస్తుతం మంచి ప్రమోషన్స్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ఏబీసీడీ సినిమాతో అల్లు శిరీష్ ఎలాంటి హిట్ కొట్టాడు అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ

అమెరికాలో బాగా బలిసిన కుటుంబంలో పుట్టిన అరవింద్ అలియాస్ అవి(అల్లు శిరీష్) అల్లరి చిల్లరిగా తిరుగుతూ బాధ్యత అనేది లేకుండా ప్రవర్తిస్తుంటాడు. అరవింద్ అలా తిరగడం చూడలేని అరవింద్ తండ్రి(నాగబాబు) జీవితం విలువ అరవింద్ కి తెలియాలంటే ఇండియా పంపాలని డిసైడ్ అవుతాడు. అర‌వింద్‌ తో పాటుగా అత‌ని స్నేహితుడు బాల షణ్ముగం అలియాస్ భాషా(భ‌ర‌త్‌)ని ఇండియా టూర్‌కి వెళ్ల‌మని చెబుతాడు. ఇండియా వ‌చ్చిన అర‌వింద్ కి ఖ‌ర్చుల‌కు గానూ తండ్రి కేవ‌లం ఐదు వేల రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తాడు. తండ్రి ఇచ్చిన దాంట్లో పొదుపుగా రోజుకి 83 రూపాయలు మాత్ర‌మే ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. ఈలోపు అరవింద్ తండ్రి అవిని, భాషాని ఎంబీఏ కాలేజ్‌లో జాయిన్ చేయిస్తాడు. అక్క‌డ అవికి నేహ‌(రుక్స‌ర్ థిల్లాన్‌) ప‌రిచ‌యం అవుతుంది. ఈ క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరుగుతుంది. మ‌రో వైపు మినిస్టర్‌(శుభ‌లేక సుధాక‌ర్‌), తన కొడుకు భార్గ‌వ్‌(రాజా)ని రాజ‌కీయ వార‌సుడిని చేయాల‌నుకుంటాడు. అయితే అక్కడి ప్రజలు భార్గవ్ కన్నా ఎక్కువగా అరవింద్ నే నమ్ముతారు. ఎప్పుడూ జల్సా చేసే అరవింద్ కేవలం 83 రూపాయలతో ఎలా అడ్జెస్ట్ అవుతాడు? నేహ‌ని అరవింద్ పెళ్లాడతాడా? అసలు భార్గవ్ తో అరవింద్ కి వచ్చిన గొడవేమిటి? అరవింద్, భార్గవ్ రాజకీయ జీవితానికి ఎలా అడ్డంకి అవుతాడు? అనేది తెలియాలంటే సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.

నటీనటుల నటన

అల్లు శిరీష్ ని చూడగానే క్లాస్ హీరో లాగే కనిపిస్తాడు. అతని స్టయిల్, లుక్స్ అన్ని రిచ్ గానే కనబడతాయి. అందుకే తనకి సరిపోయే కథలతోనే అల్లు శిరీష్ ఇన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం అల్లు శిరీష్ నుంచి ఎంత వరకు రాబట్టాలో దర్శకుడు సంజీవ్ రెడ్డి అంతా రాబట్టేసాడు. మాస్టర్ భరత్, శిరీష్ ల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాల్లో శిరీష్ టైమింగ్ బాగుంటుంది. అల్లు శిరీష్ కి సహ నటునిగా నటించిన భరత్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు. హీరోయిన్ రుష్కర్ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. గ్లామర్ గా ఆకట్టుకున్నప్పటికీ.. నటనకు ప్రాధాన్యతలేని పాత్రతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర నాగబాబు బాధ్యతారాహిత్యంగా ఉండే కొడుకు విషయంలో కేర్ తీసుకునే స్ట్రిక్ట్ తండ్రిగా ఆకట్టుకుంటాడు.

విశ్లేషణ

అల్లు శిరీష్ ఏ సినిమా చేసినా అది యావరేజ్ దగ్గరే ఆగిపోతుంది కానీ హిట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం రావడం లేదు. అందుకే ఈసారి సేఫ్ సైడ్ గా మలయాళ సూపర్ హిట్ ఏబీసీడీ సినిమాని తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టాలనుకున్నాడు. కొత్త దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా చేసాడు శిరీష్. లెక్కకు మించి ఖర్చు చేసే ఒక కుర్రాడుకి చిల్లిగ‌వ్వ కూడా లేని ప‌రిస్థితులు వ‌స్తే.. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్నీ కాస్త కామెడీ టచ్ ఇచ్చి సినిమాగా మలిచాడు దర్శకుడు. అయితే దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా దాన్ని నడిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. అమెరికా జ‌ల్సా జీవితాన్ని కానీ ఇండియాకి వ‌చ్చాక డ‌బ్బు లేక హీరో ప‌డే పాట్లని కానీ స‌హ‌జంగా తీర్చిదిద్దలేక‌పోయారు ద‌ర్శకుడు. దీంతో క‌థ‌తో ప్రేక్షకుడు ఏ ద‌శ‌లోనూ క‌నెక్ట్ అవ్వదు. సన్నివేశాలు పేర్చుకుంటూ వెళ్లిన‌ట్టే అనిపిస్తుంది త‌ప్ప సినిమాలో ఎలాంటి వినోదం పండ‌లేదు. రోజుకి కేవలం 83 రూపాయ‌ల‌తో బ‌తుకుతున్నాన‌ని హీరో చెబుతుంటాడు కానీ అత‌ని లుక్, గ‌డిపే జీవితం అలా ఉండ‌దు. ఎప్పుడూ బ్రాండెడ్ దుస్తుల‌తో రిచ్‌గా క‌నిపిస్తుంటాడు. ఇక హీరోహీరోయిన్స్ మ‌ధ్య ప్రేమ చిగురించే స‌న్నివేశాల్లోనూ స‌హ‌జ‌త్వం లేదు. విలన్ విషయాన్ని కూడా దర్శకుడు లైట్ తీసుకున్నాడు అనిపిస్తుంది. విలన్ దుబాయ్‌లో ప‌వ‌ర్‌ ఫ్యాక్టరీలు న‌డుపుతూ వేల కోట్లు సంపాదిస్తుంటాడు కానీ అత‌ను ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కాలంటే కాలేజీ విద్యార్థుల నుంచి ఫీజులు వ‌సూలు చేయ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్నట్టుగా ఆ పాత్రని తీర్చిదిద్దారు. ఎంటర్టైనింగ్ గా సాగే నరేషన్, ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా బాగానే ఆకట్టుకున్నప్పటికీ… సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శిరీష్, తన ప్రత్యర్థి మధ్య వచ్చే సీన్లు అలాగే తాను అనుకోకుండా తాను ఉండే చోట ఫేమస్ గా మారే సీన్లు సినిమాపై కాస్త ఆసక్తి పెంచుతాయి. అలాగే అక్కడక్కడా మెల్లిగా నడిచే కథనం కొన్ని చోట్ల సినిమాను ముందే ఊహించేయగలడం మైనస్ అని చెప్పాలి. మరి ఈ సినిమా మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. నిర్మాణ విలువలు కూడా సినిమాకి మైనస్.

ప్లస్ పాయింట్స్: అల్లు శిరీష్ నటన, కొన్ని కామెడీ బిట్స్

మైనస్ పాయింట్స్: కథ, కథనం, డైరెక్షన్, నిర్మాణ విలువలు, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ

రేటింగ్: 2.0/5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*