
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను గత కొన్ని దశాబ్దాలుగా శాసిస్తున్న కింజారపు కుటుంబంలో రాజకీయ తుపాను మొదలైందా. సీటు కోసం పట్టుదల పెరిగిందా. ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వం కోసం పోరాటం ప్రారంభమైందా అంటే అవుననే సమాధానం వస్తోంది. 1983 నుంచి రాజకీయాల్లో కింజారపు ఎర్రన్నాయుడు ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా కూడా గెలిచి టీడీపీకి తన సత్తా చూపిన మొనగాడు. ఆయన తన తరువాత తమ్ముడు అచ్చెన్నాయుడుని రాజకీయాల్లోకి తెచ్చారు. అచ్చెన్నాయుడు అన్న డిల్లీలో ఉంటే జిల్లాలో, పార్టీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే వారు. 2012 రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు దుర్మరణం పాలు అయ్యారు. ఆ విషాద ఘటన తరువాత ఆయన కుమారుడు రామ్మోహన్నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. తొలి దఫాలోనే గెలిచి మంచి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా అబ్బాయికి, బాబాయికి మధ్య ప్రచ్చన్న పోరు సాగుతోంది.
అసెంబ్లీకి అబ్బాయి….
గత రెండేళ్ళుగా అబ్బాయి రామ్మోహన్నాయుడు లో అసెంబ్లీకి రావాలని ఉందిట. ఆయన ఈ మేరకు నారా లోకేష్ టీం లో చేరిపోయారు. రేపటి రోజున తనకంటూ సొంత మనుషులుగా లోకేష్ కొంతమందిని తయారుచేసుకున్నారు. అందులో రామ్మోహన్ ఒకరు. దాంతో ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి పోటీ చేయాలని రామ్మోహన్ భావిస్తున్నారట. అదే సమయంలో తన బాబాయి టెక్కలి సీటుని ఆయన కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ తకరారు వస్తోంది. మళ్ళీ అసెంబ్లీకి పోటీ చేయడానికి బాబాయి సిధ్ధంగా ఉన్నారు. తాను వదిలేది లేదని అచ్చెన్నాయుడు అంటున్నారు. దాంతో ఇద్దరి మధ్యన పేచీ వస్తోంది.
బాబు వద్దకు రాయబారం……
ఈ విషయం ఇలా ఉంటే తన కొడుకు అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న ఎర్రన్నాయుడు భార్య ఈ మేరకు చంద్రబాబు వద్దకు ఓ రాయబారం తీసుకువెళ్లారని అంటున్నారు. అసెంబ్లీకి టికెట్ ఇవ్వమని కోరారని కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చలేదని అంటున్నారు. అచ్చెన్నాయుడు వైపు చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. అసెంబ్లీలో నోరున్న మంత్రిగా అచ్చెన్నాయుడుకు పేరుంది. ఆయన శాఖాపరంగా కంటే బాబుని, పార్టీని వెనకేసుకురావడంలో మంచి మార్కులు సంపాదించారు. ఇక శ్రీకాకుళం ఎంపీ సీటుకు అచ్చెన్నాయుడు కంటే అబ్బాయి బెటర్ అని బాబు అనుకుంటున్నారుట. ఇంగ్లీష్, హిందీ బాగా వచ్చిన రామ్మోహన్నాయుడు భావ ప్రకటనతో పాటు, ఉపన్యాసాల్లోనూ గట్టివాడని పేరు తెచ్చుకున్నారు. దాంతో ఆయన్ని ఎంపీకేనని బాబు డిసైడ్ అయ్యారట.
అదో కారణం….
ఇక రామ్మోహన్నాయుడు ఎంపీ వదలి ఎమ్మెల్యేకు రావడానికి మరో కారణం ఉందని అంటున్నారు. ఈసారి వైసీపీ నుంచి గట్టి పోటీ ఉంటుంది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కఋపారాణి పోటీకి దిగుతున్నారు. ఆమె తండ్రి ఎర్రన్నాయుడికే తొలి ఓటమి చూపించారు. పైగా వైసీపీ గ్రాఫ్ బాగా పెరిగింది. జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న కాళింగ సామాజిక వర్గం అండ కిల్లికి ఉంది. ఇవన్నీ కలసి ఆమె గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఒకవేళ రామ్మోహన్నాయుడు ఓడితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఒక ఎన్నికతోనే ఆగిపోతుందని ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు. ఈ కారణంతోనే అసెంబ్లీకి వేస్తే గెలవవచ్చునని భావిస్తున్నారుట. కానీ అటు బాబాయి ఇటు బాబు పడనివ్వడంలేదంటున్నారు.
Leave a Reply