వీళ్లు ఫెయిలయింది ఇలాగా…??

adinarayana-reddy-ramsubbareddy

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఏ సీటు వస్తుందని అడిగితే ఎవరైనా ఖచ్చితంగా వచ్చే సీటు అని చెప్పేది జమ్మలమడుగు. వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం… ఈసారి ఆ జిల్లాలో ఎన్ని సీట్లు అధికార తెలుగుదేశం పార్టీ సాధిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని, కానీ జమ్మలమడుగు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశంపార్టీకి విజయావకాశాలున్నాయని అందరూ నమ్ముతూ వచ్చారు.

ఇబ్బంది తప్పదా…?

కానీ తీరా చూస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలోనూ టీడీపీ ఇబ్బందులు పడుతుందని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలిందట. పోలింగ్ కేంద్రాల వారీగా తెప్పించుకుంటున్న నివేదికలను పరిశీలిస్తే జమ్మలమడుగులోనూ టీడీపీ గెలవడం కష్టమేనని తెలుస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గంపై చంద్రబాబు నాయుడు తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ప్రత్యర్థులుగా, శత్రువులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలను ఏకం చేయగలిగారు. ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీగా, రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించారు.

స్వయంకృతాపరాధమేనా..?

ఇద్దరూ ఏకమైనా టీడీపీ స్వయంకృతాపరాధంతో ఈనియోజకవర్గంలో వెనకబడిపోయినట్లు ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. నిర్లక్ష్యం, బలమైన ప్రత్యర్థి లేడన్న అతి విశ్వాసంతో టీడీపీ అభ్యర్థి జమ్మలమడుగులో వెనకబడి పోయారన్న ప్రచారం జరుగుతోంది. ఆదినారాయణరెడ్డి కడప పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారం చేయడం, కడప, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడం కూడా పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టాయంటున్నారు. ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగుపై కాకుండా ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం కూడా నష‌్టం కలిగించిందంటున్నారు. ముఖ్యమైన గ్రామాల్లో సయితం ఆదినారాయణరెడ్డి ప్రచారం చేయలేకపోయారు.

ప్రచారం పై కాకుండా….

ఇక టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి సయితం ప్రచారంలో పూర్తిగా వెనకబడ్డారంటున్నారు. తనకు పట్టున్న ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రచారం చేసిన రామసుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డి వర్గాన్ని కలుపుకుని పోవడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో తటస్థులను తమవైపు తిప్పుకోవడంలో విఫలయమ్యారని పార్టీ నుంచే విమర్శలు విన్పిస్తున్నాయి. మరోవైపు వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం చేయడం, జగన్ సతీమణి భారతి చేసిన ప్రచారం తనకు కలసి వచ్చిందని చెబుతున్నారు. గెలుపు తమదేనన్న ధీమా, అతి విశ్వాసం కొంపముంచుతాయేమోనన్న ఆందోళన పార్టీలో నెలకొని ఉంది. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 41286 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*