ఆది పెట్టిన షరతులివేనట…!!

adinarayanareddy ramsubbaredddy

జమ్మలమడుగు పంచాయతీ ముగిసిందనుకున్నారు. ఇద్దరు నేతలు మైకుల ముందుకు వచ్చి మేమంతా ఒకటేననిచెప్పి నియోజకవర్గంలోకి వెళితే అక్కడ ఎక్కడికకక్కడ క్యాడర్ నిలదీసే పరిస్థితిని ఇద్దరు నేతలు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా జమ్మలమడుగు పంచాయతీని పరిష్కరించాలని చంద్రబాబు అనేక సార్లు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈచర్చల్లో ఒకరికి పార్లమెంటు సభ్యుడిగా, మరొకరిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఇద్దరూ ఎక్కడ పోటీ చేస్తారో నిర్ణయించుకోవాలని వారికి వదిలేసినా అది సాధ్యం కాకపోవడంతో, తానే ఎవరు ? ఎక్కడ? పోటీ చేయాలో నిర్ణయిస్తానని చంద్రబాబు చెప్పారు.

ఇద్దరూ కలిశామంటున్నా….

అయితే జమ్మలమడుగులో నేతలిద్దరూ కలిసినా వారి వర్గాలు మాత్రం కలవవనేది వాస్తవం. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. గత దశాబ్దకాలంగా తాము జమ్మలమడుగులో ప్రతిపక్ష పార్టీలో ఉండి అనుభవించిన నరకయాతనను రామసుబ్బారెడ్డి వర్గీయులు గుర్తు చేస్తున్నారు. రామసుబ్బారెడ్డి తొలి నుంచి తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో పక్క చూపులు చూడలేదు. దీంతో చంద్రబాబుకు రామసుబ్బారెడ్డిపై ప్రత్యేకమైన గౌరవంతో పాటు వాత్సల్యం కూడా ఉంది. అందుకే ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకునే ముందే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి అలాగే మాట నిలుపుకున్నారు.

ఎమ్మెల్సీ కావాలని….

అంతేకాకుండా రామసుబ్బారెడ్డి షాద్ నగర్ డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా కూడా ఉన్నారు. ఈ కేసులో గతంలో జైలు శిక్ష కూడా రామసుబ్బారెడ్డి అనుభవించారు. ఈకేసులో రాజీ పడాల్సిందిగా ఆదినారాయణరెడ్డికి ఇప్పటికే చంద్రబాబు సూచించారు. అందుకు అంగీకరించిన ఆదినారాయణరెడ్డి తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని, తన సోదరుడికి త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని కోరారు. అప్పుడే రాజీ కుదురుతుందని ఆది స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగును వదులుకోవడానికి ఇద్దరు నేతలు ఇష్టపడటం లేదు. ప్రధానంగా మంత్రి ఆదినారాయణరెడ్డిని ఆయన అనుచరులు గట్టిగా వత్తిడి తెస్తున్నారు.

థర్డీ ఇయర్స్ పార్టీ అంటూ….

ఇక రామసుబ్బారెడ్డిది కూడా అదే పరిస్థితి. టిక్కెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని, త్రిముఖ పోటీలో గెలుపు సులువవుతుందని ముఖ్యులు రామసుబ్బారెడ్డికి నూరిపోస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి అన్ని రకాలుగా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చినా ఇద్దరూ పెద్దగా పట్టించుకోలేదు. తాను థర్డీ ఇయర్స్ ఇన్ పార్టీ అని రామసుబ్బారెడ్డి కొంచెం గట్టిగానే చెబుతున్నారు. ఇద్దరూ పార్లమెంటుకు పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. చంద్రబాబు వద్ద పంచాయతీ ముగిసిన తర్వాత కూడా ఇదే తరహా పరిస్థితి కన్పిస్తుంది. మొత్తం మీద ఇద్దరినీ ఏకం చేసి జమ్మలమడుగును గెలుచుకుందామనుకున్న బాబు ఆశలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 32443 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*