
అసలే ఘోర ఓటమితో కోలుకోలేని స్థితిలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతగలనుంది. ఓటమి షాక్ నుంచి తేరుకోకముందే కీలక నేత ఒకరు జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అజారుద్దీన్ త్వరలోనే తెలగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ మేరకు చర్చల ప్రక్రియ కూడా పూర్తయిందని చెబుతున్నారు. అసలే ఎంఐఎం దూరమై, ముస్లిం ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో అజారుద్దీన్ ను గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది.
అసద్ ఇంట వివాహ వేడుకల్లో….
కాంగ్రెస్ కు ఇక రాష్ట్రంలో భవిష్యత్తు లేదని భావించిన ఈ మాజీ క్రికెటర్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయిపోయారు. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కుమార్తె వివాహానికి హాజరైన అజారుద్దీన్ తన చేరిక అంశంపై చర్చలు జరిపినట్లు తెలిసింది. అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్ లు మంచి స్నేహతులు కావడంతో ఈ వివాహ వేడుకల్లోనే అజారుద్దీన్ తన మనసులో మాట బయటపెట్టినట్లు సమాచారం. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవితలు కూడా హాజరయ్యారు. ఇక్కడే అజారుద్దీన్ టీఆర్ఎస్ లో చేరిక ప్రస్తావన వచ్చినట్లు చెబుతున్నారు.
ఎన్ ఆర్ఐ ప్రయత్నాలు….
అలాగే ఒక ఎన్ఆర్ఐ తోపాటు, ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఒక నేత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తో అజారుద్దీన్ విషయాన్ని చర్చించినట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ ను పార్టీలో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీలో చేరితే సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.సికింద్రాబాద్ స్థానం ఇచ్చేందుకు కూడా గులాబీ బాస్ ఒకే చెప్పినట్లు సమాచారం. కొద్ది రోజుల్లనే అజారుద్దీన్ కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
కాంగ్రెస్ ఓటమితో…
అజారుద్దీన్ 2009 సంవత్సరంలో కాంగ్రెస్ లో చేరారు. ఆ సంవత్సరమే ఆయన ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పార్లమెంటు కు పోటీ చేసి గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల తర్వాత అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. ఆయన ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాత్రం ఆయనకు మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమిని చవి చూసిన తర్వాత ఆయన మళ్లీ ఎక్కడా కనపడలేదు. సమీక్షలకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హాజరుకాలేదు. దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్ ను వీడి గులాబీ పార్టీలో చేరతారన్నది దాదాపు తేలిపోయంది. అజారుద్దీన్ సన్నిహితులు కూడా దీనిని ధృవీకరిస్తున్నారు.
Leave a Reply