అఖిల అందరికీ జెల్లకొట్టారా…??

akhilapriya allagadda telugudesamparty

భూమా నాగిరెడ్డి వార‌సురాలిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన భూమా అఖిల ప్రియ.. మొద‌ట్లో ఎంత శాంతంగా ఉండేదో అంద‌రికీ తెలిసిందే. వైసీపీలో ఉండ‌గా.. అసెంబ్లీ చివ‌రి బెంచీలో కూర్చుని మౌనంగా ఉంటూ.. అన్నీ గ‌మ‌నించిన ఆమెకు రాజ‌కీయాలు అబ్బ‌డం చాలా క‌ష్ట‌మ‌ని అనుకున్నారు అంద‌రూ. అంతేకాకుండా.. పెద్ద‌గా ఎవ‌రితోనూ క‌లిసే వారు కూడా కాదు. అసెంబ్లీ లాబీల్లోనూ ఆమె ఎవ‌రితోనూ మాట్లాడేది ఉండేది కాదు. దీంతో ఆమె రాజకీ యంగా అంత‌గా రాణించ‌రని అనుకున్నారు. కానీ, ఇలా అనుకున్న వారంద‌రికీ జ‌ల్ల‌కొట్టి.. జుట్టు పీక్కునే రేంజ్‌లో రాజ‌కీయాలు చేస్తున్నారు ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న అఖిల ప్రియ‌. ఏకంగా మంత్రి స్టిక్కర్లు ఉన్న వాహనాలతోనే ఎర్రమట్టి దందాల‌కు పాల్పడే స్థాయికి ఎదిగారు. ఈ విషయంలో మొన్నటి వరకు ‘మామా’ అని పిలిచిన బుడ్డా రాజశేఖరరెడ్డితోనే వైరానికి దిగారు.

పొలిటికల్ డ్రామానేనా?

త‌న అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదా చేశారంటూ గన్‌మెన్లను వెనక్కి పంపడం, చివరకు సీఎం పర్యటనకూ గైర్హాజరు కావడం ‘పొలిటికల్‌ డ్రామా’లో భాగమేనన్న ప్రచారం సాగుతోంది. తన భర్త పెత్తనంపై లేవనెత్తిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వకుండా.. ఈ విధంగా డొంకతిరుగుడుగా కార్యకర్తల పేరుతో వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్న తీరు చూసి రాజకీయ మేధావులే విస్తుపోతున్నారు. నీరు–చెట్టు పథకంలో పనులు చేయకపోయినా బిల్లులు ఇచ్చేందుకు అనుంగు అధికారిని నియమించుకోవడమే కాకుండా.. తనిఖీలు చేయాలంటే విజిలెన్స్‌ అధికారులు కూడా జంకే పరిస్థితిని కల్పించారు. పక్క నియోజకవర్గంలో మంత్రి పేరుతో సాగుతున్న ఎర్రమట్టి దందాపై విచారణకు వచ్చిన విజిలెన్స్‌ అధికారులు చివరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెనుదిరిగారంటే ఆమె జబర్దస్త్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆరోపణలు ఒకవైపు…..

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏకంగా రూ.150 కోట్ల విలువైన నీరు–చెట్టు పనులు చేపట్టారు. ఈ పనులన్నీ ఓ బడా కాంట్రాక్టర్‌తో పాటు అధికార పార్టీ నేతలకు అప్పజెప్పారు. ప్రతి పనిలోనూ మంత్రి 20 శాతం మేర కమీషన్‌ తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అఖిలప్రియ సొంత నియోజకవర్గమైన ఆళ్లగడ్డలోనే కాకుండా పక్కనే ఉన్న శ్రీశైలం నియోజకవర్గంలోనూ వేలు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి చెరువు నుంచి ఎర్రమట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. రోజుకు సుమారు వంద టిప్పర్ల ఎర్రమట్టిని ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే రోజుకు రూ. 5 లక్షల చొప్పున ఆదాయం ఉంది.

భర్త పెత్తనంతో…..

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారులు రెండు విధాలుగా ఒత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు మంత్రి.. మరోవైపు ఆమె భర్త పెత్తనంతో నలిగిపోతున్నారు. పెళ్లి తర్వాత మొత్తం మకాంను ఆళ్లగడ్డకే మంత్రి భర్త మార్చేశారు. నిరంతరం మంత్రితో పాటే తిరుగుతూ అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఒకవైపు మంత్రి ఆదేశాలతో సతమతమవుతున్న అధికారులకు… మరోవైపు మంత్రి భర్త పెత్తనం మరింత తలనొప్పిగా మారుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆళ్లగడ్డ నగర పంచాయతీలో భర్త పెత్తనంతో అధికారులు సతమతమవుతున్నారు. సో.. మొత్తంగా చూస్తే.. అఖిల ప్రియ ఇంతింతై.. అన్న‌ట్టుగా ఎదిగి.. అటు పార్టీ అధినేత‌కే కాకుండా ఇటు ప్ర‌జ‌ల‌కు కూడా కొర‌క‌రాని కొయ్య‌గా మారింద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 39095 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*