ఇప్పుడు తెలిసొచ్చిందట…!!

akhilesh-yadav-mulayam-singh-yadav

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు తత్వం బోధపడింది. ఆయనకు వరస ఓటములు ఎదురవుతుండంటంతో వ్యూహలోపమే కారణమని అర్థమయింది. అంతేకాకుండా తమ పార్టీని అన్ని కులాలను ఆదరించలేదని ఫలితాల తర్వాత అవగతమయింది. పెద్దాయన ములాయం సింగ్ యాదవ్ ను కూడా దూరంపెట్టి తప్పు చేశానని అఖిలేష్ యాదవ్ బాధపడుతున్నారట. అందుకే ఫలితాలు వచ్చిన తర్వాత వరసగా తండ్రి ములాయం సింగ్ యాదవ్ తో భేటీ అవుతున్నారు. పార్టీని పటిష్టపర్చడంపై పెద్దాయన సూచనలు తీసుకుంటున్నారు.

భ్రమపడి….భంగపడి….

అఖిలేష్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రి కాగానే అంతా తన బలమేనని భ్రమపడ్డారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను, బాబాయ్ శివపాల్ యాదవ్ ను పక్కన పెట్టారు. రెండేళ్ల నుంచి దూరంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు పెద్దాయనను కలసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకు టిక్కెట్ ఖరారుచేశారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో పొత్తు పెట్టుకుంటున్నానన్న విషయం కనీసం తండ్రితో కూడా సంప్రదించలేదు. ఏకపక్షంగా నిర్ణయించారు. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను కూడా తీసుకోలేదు.

ఫలితాలను విశ్లేషించుకుంటే…..

దీంతో మాయావతి, అఖిలేష్ యాదవ్ పార్టీల కలయికను ప్రజలు స్వాగతించలేదు. మాయావతికి ఉత్తరప్రదేశ్ లో పది పార్లమెంటు స్థానాలు వస్తే, అఖిలేష్ యాదవ్ పార్టీకి కేవలం ఐదు స్థానాలే దక్కాయి. తొలుత తమను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందేమోనని అని అఖిలేష్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీలపర్యటనలతో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లు కూడా చీలిపోయాయని భావించారు. కానీ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఫలితాల తర్వాత విశ్లేషిస్తే బీఎస్పీ, ఎస్పీల ఓట్లు ఒకరికొకరికి బదిలీ కాలేదని తేలిపోయింది.

తండ్రే దిక్కంటున్న…..

దీంతో తండ్రి ములాయం సింగ్ యాదవ్ ను పదే పదే అఖిలేష్ కలుస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే యాదవుల పార్టీ అని ఉన్న ముద్రను తొలుత తొలగించాలని ములాయం సింగ్ యాదవ్ సూచించారట. అంతేకాదు పక్కన తిప్పుకునే నేతలను యాదవేతరులను పెట్టుకోవాలని కూడా పెద్దాయన అఖిలేష్ కు సూచించారట. దీనికన్నా ముఖ్యమైనది బాబాయ్ శివపాల్ యాదవ్ ను కలుపుకుని పోవాలని గట్టిగానే చెప్పారట ములాయం. మరి తండ్రి హితోక్తులు ఇప్పటికైనా అఖిలేష్ చెవులకెక్కుతాయా? యూపీలో మళ్లీ ఎస్పీ గాడిన పడేనా? అన్నది తెలియాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 30182 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*