
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా జరగనుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. తెనాలి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన 2009లో ఈ నియోజకవర్గంలోకి అడుగుపెట్టి తొలి ఎన్నికలోనే ఓటమి పాలయ్యారు. అప్పట్లో నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మీద పోటీ చేసి 19వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే కేవలం ఒకసారి మాత్రమే తెనాలి నుంచి గెలిచినా ఆయన అనేక విమర్శలు, ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
నాదెండ్ల పోటీతో…..
ఈసారి పోటీలో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగే అవకాశముంది. ఆయనకు ఇక్కడ మంచిపట్టుంది. సౌమ్యుడు కావడం, జనసేన ఓటు బ్యాంకు ఇక్కడ ఉండటంతో నాదెండ్ల మనోహర్ కొంత ఊపు మీద ఉన్నారు. స్పీకర్ గా పనిచేయడం, జనసేనలో తగిన గుర్తింపు ఉండటం కూడా నాదెండ్లకు కలసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై కూడా సానుభూతి పుష్కలంగా ఉంది. గత ఎన్నికల్లో ఓటమి చెందడంతో పాటు శివకుమార్ తండ్రి మాజీ మంత్రిగా కూడా ఉన్నారు. అయితే శివకుమార్ అన్న, వదినలు నేటికీ టీడీపీలోనే కొనసాగుతుండటం విశేషం.
అభివృద్ధితో పాటు ఆరోపణలూ…
ఇక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విషయానికొస్తే ఆయన స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటారన్న పేరుంది. అభివృద్ధి పనులు కూడా బాగానే చేశారన్నది తెనాలి వాసుల అభిప్రాయం. దీంతో పాటు అవినీతి ఆరోపణలు ఆయన మీద పుష్కలంగా ఉన్నాయి. ఇసుక తవ్వకాలపై ఎమ్మెల్యే అనుచరుల దందా నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా ఉంది. అంతేకాకుండా భూ కబ్జాల్లోనూ ఎమ్మెల్యే పేరు నానుతోంది. దీంతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కొంత ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి తెనాలి నుంచి పోటీ చేయాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నా… అధిష్టానం నిర్ణయం మాత్రం వేరే విధంగా ఉందంటున్నారు.
గల్లాను దించుతారా?
తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఏ సమయంలోనైనా పార్టీని వీడే అవకాశముంది. ఆయన స్థానంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నుపోటీచేయించాలన్న ఉద్దేశ్యం కూడా ఉంది. తెనాలిలో గల్లా అరుణకుమారిని గాని, ఇటీవల పార్టీలో చేరిన సినీనటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు పేర్లుకూడా విన్పిస్తున్నాయి. అయితే ఆలపాటి రాజేంద్రప్రసాద్ సన్నిహితులు మాత్రం తెనాలి టిక్కెట్ తమదేనని చెబుతున్నారు. మరి చంద్రబాబు చివరి క్షణంలో తీసుకునే నిర్ణయంలో తెనాలి కూడా ఒకటి.
Leave a Reply