ఆళ్ల ఎందుకు టార్గెట్ అయ్యారు?

మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డి. ఆర్కే గా సుపరిచితుడు. గత నాలుగేళ్లుగా ఏపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి చంద్రబాబుపైన న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ సైకిల్ పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు. అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? ఆళ్లను టార్గెట్ చేసిందా? అంటే అవుననే అంటున్నారు వైసీపీ నేతలు. వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులను బనాయించాలని చూస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పై క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేశారు. ఆయన విచారణకు కూడా పిలిపించారు. తనకు ఏం సంబంధం లేదని కోటంరెడ్డి చెబుతున్నా పోలీసు విచారణకు రావాల్సిందేనని అంటున్నారు.

కోటంరెడ్డి తర్వాత…..

కోటంరెడ్డి ఎపిసోడ్ మరచిపోక ముందే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై కేసులు నమోదవుతున్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఏసీబీ కేసులో విచారణకు పిలిపించారు. గుంటూరు డీఎస్సీ దుర్గా ప్రసాద్ ఏసీబీ కేసులో చిక్కుకున్నారు. ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నారంటూ సోదాలు జరిపింది. అయితే ఈ సోదాల్లో డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆస్తులు కొన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి కుటుంబీకుల పేరిట ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల అఫడవిట్ లోనూ ఈ ఆస్తులు పేర్కొనకపోవడంతో అనుమానమొచ్చిన ఏసీబీ అధికారులు ఆయనను విచారణకు పిలిపించారు. అయితే ఆయనకు కంటి ఆపరేషన్ ఉండటంతో ఆయన తరుపున లాయర్ హాజరయ్యారు. ఈ నెల 29వ తేదీన హాజరుకావాలని ఏసీబీ అధికారులు ఆళ్లను ఆదేశించారు.

ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి……

రాజధానికి ఆనుకుని ఉన్న నియోజకవర్గం మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయనప్పటి నుంచి వదలకుండా కేసులు వేస్తున్నారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకున్నా వెంటనే ఆళ్ల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం భూ సమీకరణ చేపడితే ఆయన రాజధాని రైతులతో కలసి న్యాయపోరాటానికి దిగారు. ఇక సదావర్తి భూముల వేలం విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు. ఇక చంద్రబాబు ఓటుకు నోటు కేసులో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆళ్ల. అలాగే మంగళగిరిలో పేదల ఇళ్ల తరలింపు విషయంలోనూ కోర్టును ఆశ్రయించి వారికి అండగా నిలబడ్డారు.

కోర్టు పక్షిగా మారి…..

ఇక కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతిస్తే దాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశారు ఆర్కే. దీంతో హైకోర్టు నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేసింది. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణ నియామకం విషయంలోనూ ఆర్కే కోర్టుకు వెళ్లడంతో వెంటనే కొత్త వారిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. టీడీపీ నేతలపై ఉన్న 132 క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఎత్తివేయడంపై కూడా ఆర్కే హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై న్యాయస్థానం స్టేఇచ్చింది. ఇలా వరుసగా అన్ని పనులకూ అడ్డుతగులుతున్న ఆర్కేపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని వైసీపీ ఆరోపిస్తుంది. తప్పుడు కేసులు పెట్టినా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని వైసీపీ చెబుతోంది. మొత్తం మీద ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. మరి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 22708 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*