
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. వచ్చే నెల మొదటి వారంలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ముందున్నట్లు కన్పిస్తుంది. ఎన్టీఏ కూటమి రాష్ట్రాల వారీగా పొత్తులు కుదుర్చుకుంటూ వేగంగా వెళుతుంటే… భారత జాతీయ కాంగ్రెస్ మాత్రం అందుకు భిన్నంగా నిదానంగా అడుగులు వేస్తోంది. అధికారంలో ఉంది కాబట్టి సహజంగా భారతీయ జనతా పార్టీ వైపు కొన్ని ప్రాంతీయ పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. కానీ కాంగ్రెస్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటం విశేషం.
గ్యారంటీ లేకనేనా?
అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేకపోవడం, రాహుల్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం వల్లనే వివిధ రాష్ట్రాల్లో పొత్తులు కుదరడం లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. యూపీఏ 3 ఉంటుందా? లేదా? అన్నది కూడా సందేహంగానే కన్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకూ బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పొత్తులను ఖరారు చేసుకోవడమే కాకుండా సీట్ల సర్దుబాటు అంశంపై కూడా ఒక స్పష్టత వచ్చింది. మహారాష్ట్రలో శివసేనతో, బీహార్ లో జనతాదళ్ యు, తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తును భారతీయ జనతా పార్టీ ఖరారు చేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిరంతరం పార్లమెంటు ఎన్నికలు, రాష్ట్రాల పొత్తులపైనే ఆయన దృష్టి సారించారు.
చర్చలు కూడా ….
కానీ కాంగ్రెస్ విషయానికొస్తే దాని పరిస్థితి భిన్నంగా ఉంది. బీహార్ లోఆర్జేడీతో కలసి వెళ్లేందుకు అవకాశమున్నప్పటికీ ఇప్పటి వరకూ చర్చలు ప్రారంభించలేదు. తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకేతోనూ, మహారాష్ట్రలో ఎన్సీపీతోనూ ఆ పార్టీ పొత్తును ఖరారు చేసుకుంది. ఇక అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కాంగ్రెస్ ను పక్కన పెట్టేశాయి. ఇక్కడ కాంగ్రెస్ ఒంటరిగా పోరుచేయక తప్పని పరిస్థితి. మిత్రపక్షాలుగా వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ కు అండగా ఉంటున్న పార్టీలు సయితం రాష్ట్రాల్లో పొత్తులకు పెద్దగా సుముఖత చూపడం లేదు.
ప్రాంతీయ పార్టీలు సయితం….
పశ్చిమ బెంగాల్ విషయానికొస్తే మమత బెనర్జీ బీజేపీపై దూకుడుగా వెళుతున్నా.. అదే సమయంలో కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ లోనూ సేమ్ టు సేమ్. తెలంగాణాలోనూ ఈసారి కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితి. ఒక్క కర్ణాటకలో మాత్రమే జనతాదళ్ ఎస్ తో ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లే అవకాశముంది. వామపక్షాలు సయితం ఎన్నికల తర్వాతనే పొత్తు అని ప్రకటించాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే తలపడాల్సిన స్థితి నెలకొంది. మరి ఈ పరిణామాలు కాంగ్రెస్ కు లాభం చేకూరుస్తాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Leave a Reply