బుల్ ఫైట్…. గెలుపు ఎవరిదంటే…??

ambati-rambabu-kodela-sivaprasadarao

వరసగా నరసారావుపేట నియోజకవర్గం నుండి 1989, 1994, 99లలో విజయం సాధించిన ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాdరావు… 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా నరసరావుపేట ఆ పార్టీకి కేటాయించారు. దీంతో కోడెల పక్కనే ఉన్న సత్తెనపల్లి నుండి పోటీకి దిగి కేవలం 700 ఓట్లతో వైసీపీ నేత అంబటి రాంబాబు మీద విజయం సాధించారు. ఇక ఈ సారి ఎన్నికల్లో ఇరువురు నేతల మీద సొంత పార్టీలలో అసంతృప్తి ఉన్నప్పటికీ మరొకసారి వీరిద్దరూ ఎన్నికల బరిలో తలపడనున్నారు. చంద్రబాబుతో పోరాడి మరోసారి సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న కోడెల అభ్యర్థిత్వాన్ని లోకల్ టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కోడెల వద్దు చంద్రబాబు ముద్దు అంటూ స్థానికంగా ఆందోళనలు కూడా చేశారు. అయితే కోడెల అసంతృప్త నేతలనీ పిలిచి మాట్లాడి వారిని బుజ్జగించి ప్రచారంలో దిగారు.

అంబటి మీద కూడా….

అటు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ అంబటి రాంబాబుకు ఇవ్వొద్దని వైసీపీలోని ఆయన వ్యతిరేకవర్గం ఎప్పటి నుంచో పార్టీ అధినాయకత్వానికి చెబుతూ వస్తోంది. అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే సత్తెనపల్లిలో వైసీపీ ఓటమి ఖాయమంటూ పార్టీ నేతలు వాదిస్తున్నారు. బత్తుల బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలోని కొందరు నేతలు ఈ అంశాన్ని పార్టీ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయిన జగన్ అంబటి వైపే మొగ్గు చూపి టికెట్ ఇచ్చారు. దీంతో మరోసారి సత్తెనపల్లి పోరు రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో గెలిచి స్పీకర్ పదవి చేపట్టిన కోడెల నియోజకవర్గంలో మంచి అభివృద్ధే చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు. సి‌సి రోడ్ల నిర్మాణం, అంగనవాడిల నిర్మాణం బాగా జరిగాయి. ఇక సత్తెనపల్లిలో ఉన్న చెరువు మధ్యలో హైదరాబాద్‌లో బుద్ధ విగ్రహం పెట్టినట్లు 70 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టి చెరువుకట్టను మినీ ట్యాంక్‌బండ్‌లాగా మార్చారు.

అభివృద్ధి పేరుతో…..

ప్రతి గ్రామంలోనూ ఆర్.ఓ. యంత్రాలను ఏర్పాటుచేసి త్రాగునీరు వసతి కల్పించారు. గ్రామాల్లో చాలాకాలం నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీల కోసం ఒక్కొక్క గ్రామానికి ఇరవై లక్షల రూపాయల వంతున కేటాయించారు. సత్తెనపల్లి మునిసిపాలిటీ రాష్ట్రం మొత్తంలోకి ఆదర్శ (మోడల్‌) పురపాలక సంఘంగా ఎంపికైంది. చిన్న పట్టణమైనా వీధి దీపాలుగా ఎల్‌ఈడీ లైట్లూ, వాకింగ్‌ ట్రాక్‌, పార్కులు, సర్వత్రా పచ్చదనం, అతిథిగృహాలు, ఆటస్థలం, కళాశాలలకు కొత్త భవనాలు, కొత్తదనంతో వావిలాల ఘాట్‌, వందపడకల ఆస్పత్రి (విస్తరణలో) మొదలైనవి మునిసిపాలిటీకి గుర్తింపు తెచ్చాయి. అలాగే ఎన్టీఆర్ ఇళ్ళు, పెన్షన్లు లాంటి సంక్షేమ పథకాలు కూడా బాగానే అమలు అయ్యాయి.

అవినీతి ఆరోపణలు…..

ఇక ఈ ఐదు సంవత్సరాలు కోడెల కుమారుడు శివరాం సత్తెనపల్లిలో దౌర్జన్యంగా భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారని, ఇందులో వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. చిన్నోడు నుండి పెద్దోడు వరకు,పేదవాడి నుండి బిజినెస్ మ్యాన్ వరకు అందరి దగ్గర టాక్స్ వసూలు చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలు నేపథ్యంలో కోడెల కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సత్తెనపల్లి టికెట్ దక్కించుకున్న కోడెల… తనతో, తన కుటుంబంతో ఇకపై ఎలాంటి సమస్యలు రావని హామీ ఇస్తున్నానని అన్నారు.

జనసేన ప్రభావం…..

అటు వైసీపీ సమన్వయ కర్తగా అంబటి రాంబాబు మళ్ళీ టికెట్ దక్కించుకున్నారు. ఇతనిపై స్థానిక నేతల్లో అసంతృప్తి ఉంది. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శ ఉంది. అయితే కోడెల మీద ఉన్న వ్యతిరేకిత, వైసీపీకి పెరిగిన ప్రజాబలం తనని గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. కానీ అసమ్మతి నేతలు అంబటి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాపు సామాజిక నేతలు ఎలానడుచుకుంటారనే దానిపై గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి. ఈ నియోజకవర్గంలో కమ్మ, ముస్లిం, మాదిగ, కాపు, రెడ్డి, బిసి ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అయితే కమ్మ, ముస్లిం, మాదిగ, కాపు, రెడ్డి వర్గాలు కీలకం కానున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 37161 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*