
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుండెకాయ లాంటి జిల్లా అయిన గుంటూరు జిల్లా రాజకీయాల్లో.. అధికార టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా అంటేనే రాజకీయ చైతన్యం ఎలా ఉంటుందో ?ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి రెండు, మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న తల పండిన సీనియర్లు అసెంబ్లీకి ప్రాథినిత్యం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్న సత్తెనపల్లి… ఆయన గత నియోజకవర్గమైన నరసారావుపేటలో వచ్చే ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
స్వల్ప ఓట్ల తేడాతోనే…..
1983 నుంచి నరసారావుపేటలో వరుసుగా ఐదు సార్లు గెలిచి… రెండు సార్లు ఓడిన మాజీ హోం మంత్రి, ప్రస్తుత స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గమైన సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై చావు తప్పి కన్ను లొట్ట బోయినట్టు కేవలం 700 ఓట్ల మెజార్టీతో మాత్రమే విజయం సాధించారు. కోడెల సత్తెనపల్లి, నరసారావుపేటలో కొంత వరకు అభివృద్ధి చేసినా, ప్రజలకు అందుబాటులో ఉన్నారన్న మాట వినిపిస్తున్నా… కొన్ని కారణాల వల్ల సత్తెనపల్లిలో ఆయనపై తీవ్ర వ్యతిరేjత వ్యక్తమౌతోంది. ఇందులో కోడెల స్వయంకృత అపరాధం కూడా కొంత ఉంది.
సన్ ఎఫెక్ట్…….
ఆయన కుమారుడు కోడెల శివ రాం ప్రసాద్‌కు మితిమీరిన పెత్తనం ఇవ్వడం వల్లే పార్టీ కేడర్‌లో కోడెలపై ఇంత అసంతృప్తి రావడానికి కారణం అయ్యిందన్న చర్చలు కూడా జిల్లా అంతటా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కోడెల తనతో పాటు తన కుమారుడు శివ రాంప్రసాద్, కుమార్తె విజయలక్ష్మిలలో ఎవరో ఒకరిని కూడా పొలిటికల్ ఎంట్రీ చేయించాలని కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో కోడెల వారసుడే కాకుండా చాలా మంది సీనియర్లు సైతం తమ వారసులను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. రాయపాటి, యరపతినేని, జీవి, కొమ్మాలపాటి వారసులంతా రేసులో ఉన్నవారే. అయితే చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకే టికెట్ ప్రాతిపదికిన ఇటీవల కోడెలతో ‘‘వచ్చే ఎన్నికల్లో మీ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరికే సీటు ఇస్తాను… సత్తెనపల్లా , నరసారావుపేటా ఆప్షన్ మీదే. రెండో సీటుపై మీ పెత్తనం ఉండదు’’ అని ఖరాకండిగా తెగేసి చెప్పినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం ద్వారా తెలిసింది.
నరసరావుపేట నుంచే…..
కోడెల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం ఆయన వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట నుంచి పోటీ చేసేందుకే ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సత్తెనపల్లి టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డికి ఖరారు అయినట్టు తెలుస్తోంది. గతంలో 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరుపున వరుసగా రెండు సార్లు గెలిచిన యర్రం వెంకటేశ్వర రెడ్డి ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన చంద్రబాబుతో సమావేశం అయ్యారు. యర్రం రెండుసార్లు గెలిచినా వివాదాలకు దూరంగా ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరే ఉంది. ఈ సమావేశంలో కోడెల నరసారావుపేటకే వెళ్లతారు అప్పటి వరకు మీరు సైలెంట్‌గా ఉండండి. సత్తెనపల్లి సీటు మీదే అని బలమైన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశం ఇప్పుడు గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా కోడెల ఫ్యామిలిని నరసారావుపేటకు పరిమితం చేస్తే సత్తెనపల్లిలో యర్రంకు లైన్ క్లియర్ చేసేలా బాబు పావులు కదుపుతున్నట్టు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
Leave a Reply