
రాజస్థాన్ తమ చేజారిపోతుందని కమలనాధుల్లో కలవరం ప్రారంభమయింది. ఏ సర్వే చూసినా రాజస్థాన్ లో ఓటమి ఖాయమని తేల్చి చెబుతున్నాయి. వసుంధరరాజే పై ఉన్న వ్యతిరేకతతో పాటు మోడీ ప్రభావం గణనీయంగా తగ్గిపోవడంతో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లకన్నా రాజస్థాన్ ఓటమిలో ముందన్నదన్న విషయం స్పష్టమవుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కొంత చెమటోడిస్తే విజయం సాధించే అవకాశాలున్నాయి. కానీ రాజస్థాన్ లో లేశమంత కూడా ఆశలు లేవు. అయినా అమిత్ షా పట్టువదలకుండా రాజస్థాన్ పై ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.
ఆమే మైనస్…..
రాజస్థాన్ లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ముఖ్యమంత్రిగా వసుంధరరాజే కూడా పార్టీకి మైనస్ గా మారింది. ఈ విషయం దాదాపు రెండేళ్ల క్రితమే పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలిసినా ఆమెను మార్చే సాహసం చేయలేకపోయింది. ఆర్ఎస్ఎస్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా నేరుగా పార్టీలో ఉన్న వసుంధరరాజేపై ఉన్న వ్యతిరేకతను ఆమెపైకే నెట్టాలన్నది అమిత్ షా వ్యూహంగా కన్పిస్తోంది. పార్టీపై ప్రభావం చూపకుండా వసుంధర రాజేను తామే టార్గెట్ చేసి ప్రజల్లో కొంత సానుభూతినైనా సంపాదించాలని అమిత్ షా వ్యూహరచన చేస్తున్నారు.
రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్……
అందుకోసమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలను అమిత్ షా రంగంలోకి దించారు. వసుంధరకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వ్యూహంలో భాగమేనంటున్నారు. వసుంధరను పార్టీతో పాటు, ఆర్ఎస్ఎస్ కూడా వ్యతిరేకిస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళితే పార్టీకి కొంత సానుకూలత ఏర్పడుతుందని షా భావిస్తున్నారు. దీంతో పాటు మోదీకి రాజస్థాన్ లో పెద్దగా వ్యతిరేకత లేదని తెలుసుకున్న పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనతో వరుస సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
పార్టీ నుంచి వెళ్లిన నేతలను…..
ఇటీవల పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని కూడా అమిత్ షా తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో వసుంధరరాజేను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు మన్వేంద్ర సింగ్, ఘన్ శ్యామ్ తివారీ, హనుమాన్ బెనివాల్ వంటి నేతలు పార్టీని వీడివెళ్లారు. వీరు వసుంధరపై ఆగ్రహంతోనే వెళ్లారని భావించిన అమిత్ షా వారితో మంతనాలు జరిపేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కొంత సానుకూలంగానైనా మార్చి ఎలాగైనా రాజస్థాన్ ను దక్కించుకోవాలన్నది షా వ్యూహంగా ఉంది. మరోవైపు తాజాగా వెల్లడించిన టైమ్స్ నౌ సర్వేలో కూడా రాజస్థాన్ లో ఉన్న 200 సీట్లలో బీజేపీకి కేవలం 75 సీట్లు మాత్రమే వస్తాయని తేలడంతో షా నష్టనివారణ చర్యలకు దిగారు. మరి ఇవి ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి.
Leave a Reply