జగన్ జట్టులోకి ఆనం….రీజన్ ఏంటంటే?

నెల్లూరులో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ఆనం సోదరులు టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆనం రామనారాయణ రెడ్డి కార్యాలయంలో చంద్రబాబు ఫొటోలో కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలిసింది. సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గతకొంతకాలంగా టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. ఆనం సోదరులకు తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఆనం కుటుంబం దశాబ్దం పాటు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించింది.

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి….

గత 2014 ఎన్నికల్లో ఆనం సోదరులు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిక సందర్భంగా సోదరుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా ఆ హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోనూ స్థానిక టీడీపీ నేతలు ఆనంకు సహకరించడం లేదు. దీనిని అనేకసార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

టీడీపీ హ్యాండ్ ఇవ్వడంతో….

వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసినా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు తమకు సహకరిస్తాయన్న నమ్మకం కూడా కూడా ఆనం రామనారాయణకు లేదు. అందుకే ఆయన గతకొద్ది రోజుల నుంచి టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన కార్యాలయం నుంచి చంద్రబాబు ఫొటోలను తొలగించడం కూడా దీనికి అద్దం పడుతోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనం సోదరుల్లో ఒకరైన వివేకా అనారోగ్యంతో ఉండగా ఆయనను పరామర్శించడానికి వెళ్లినప్పుడు చంద్రబాబు వస్తున్నారని తెలిసి రామనారాయణరెడ్డి ఆసుపత్రి నుంచి కావాలనే వెళ్లిపోయారని చెబుతున్నారు.

వైసీపీతో టచ్ లో….

ఇదిలా ఉండగా ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట తనకు సీటు ఇవ్వాలని ఆనం వైసీపీ ముందు షరతు పెట్టినట్లు సమాచారం. అయితే వైసీపీ మాత్రం ఆత్మకూరు సీటు ఇస్తామని చెబుతున్నారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ తో చర్చలు జరుపుతున్నారు. సీటు విషయం ఖరారైన వెంటనే ఆనం వైసీపీలో చేరతారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. అయినా ఆయన వైసీపీలోకి వెళ్లేందుకే నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో దెబ్బ తగలనుంది. ఆనం రాకతో వైసీపీ బలం మరింత పెరగనుందన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 30943 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*