ఆనంకు ‘‘రామ్’’ బాణం తగులుతుందా??

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విశ్వప్రయత్నాలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు చాలా నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చడంతో ఉన్న తలనొప్పులకు తోడుగా కొత్త తలనొప్పులు తయారు అవుతున్నట్టే కనపడుతోంది. గుంటూరు, ప్రకాశం, కృష్టా, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు ఉన్న నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చి వారి స్థానాల్లో కొత్త ఇన్‌చార్జులను నియమించడంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీలో కొత్త, పాత గ్రూపుల మధ్య‌ తీవ్రమైన యుద్ధమే నడుస్తోంది. వీరిద్దరి మధ్య‌ సయోధ్య కుదర్చలేక వైసీపీ అధిష్టానం సైతం చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చేసింది. వైసీపీ బలహీనంగా ఉన్న జిల్లాలు, నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉందని అనుకుంటే కొంత వరకు సర్దుబాటు చేసుకోవచ్చు.

వెంకటగిరి నియోజకవర్గంలో…..

వైసీపీ చాలా బలంగా ఉన్న నెల్లూరు జిల్లాకు కూడా ఇప్పుడు ఈ కుమ్ములాటల సంస్కృతి పాకేసింది. నెల్లూరు జిల్లా వైసీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య‌ ఇప్పుడు అస‌మ్మ‌తి యుద్ధానికి తెరలేచినట్టే కనిపిస్తోంది. ఇందుకు వెంకటగిరి నియోజకవర్గం వేదిక కాబోతుంది. ఇప్పటి వరకు నివురు గప్పిన నిప్పులా నడుస్తున్న ఈ యుద్ధం ఎన్నికల వేళ‌ తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు నెల్లూరు జిల్లా వైసీపీ బాధ్యాతలను జెడ్పీచైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర‌రెడ్డి పర్యవేక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆయన పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న టైమ్‌లో జిల్లాకే చెందిన రెండు బలమైన కుటుంబాలకు చెందిన నేతలు వైసీపీలోకి రావడంతో వెంకటగిరి వైసీపీ రాజకీయం ఎవరి అంచనాలకు అందకుండా సాగుతోంది.

లోలోపల అసంతృప్తి….

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర ఉన్న ఆనం ఫ్యామిలీకి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలోకి చేరగా… మాజీ ముఖ్య మంత్రి నేదురుమిల్లి జనార్థన్‌ రెడ్డి తనయుడు నేదురుమిల్లి రాంకుమార్‌ రెడ్డి సైతం వైసీపీలోకి చేరారు. వీరిద్దరు పార్టీలో చేరినప్పుడు  సీట్లపై హామీలతోనే చేరారు. వాస్తవానికి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు సీటు ఆశించగా అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మేకపాటి గౌతమ్‌రెడ్డి ఉండడంతో జగన్‌ అనంకు వెంకటగిరి నియోజకవర్గ పగ్గాలు అప్పగించారు. అయితే వెంకటగిరి నియోజకవర్గంలో ఇటు నేదురుమిల్లి ఫ్యామిలీకి సైతం మంచి పట్టుంది. గతంలో ఇక్కడ నుంచి ఆ ఫ్యామిలీ విజయాలు సాధించింది. ఇక్క‌డ త‌మ ఫ్యామిలీకి ఉన్న ప‌ట్టు నేప‌థ్యంలోనే రాంకుమార్‌ రెడ్డి వెంకటగిరి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్‌ అనూహ్యంగా ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ప్రకటించడంతో రాంకుమార్‌ రెడ్డి పైకి చెప్పుకోలేక‌పోయినా లోప‌ల మాత్రం అసంతృప్తితోనే ఉన్నారు.

నేదురుమిల్లి ఫ్యూచర్ ఏంటి?

నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆనంను ప్రకటించినంత మాత్రాన ఆయనే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి కారని ప్రకటించడంతో ఈ సీటుపై రాంకుమార్‌ రెడ్డి సైతం ఆశలు పెట్టుకున్నట్టు తేలింది. తాజాగా వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించిన సమావేశంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణిని గోవర్థనరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డే ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో వెంకటగిరి రాజకీయం వేడెక్కింది. ఈ సమావేశానికి రాంకుమార్‌రెడ్డి వర్గం డుమ్మా కొట్టింది. నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన నియోజకవర్గాల్లో మేకాపాటి, ఆనం వర్గాలు పాగా వెయ్యగా మిగిలిన నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీకి బలమైన నేతలు ఉన్నారు. ఈ టైమ్‌లో నేదురుమిల్లి రాజకీయ వారసుడికి వైసీపీలో జగన్‌ ఎలాంటి ఫ్యూచర్‌ ఇస్తారన్నది మాత్రం సందిగ్ధంలోనే ఉంది. నేదురుమిల్లిని ఎంపీగా పంపే ఆలోచన జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒకసారి జగన్ ఇద్దరు నేతలను కలిపికూర్చోబెట్టి మాట్లాడితే ఇక వెంకటగిరిలో మెజారిటీ ఎంత అనేదే లెక్కేసుకోవాల్సి ఉంటుందంటున్నారు వైసీపీ నేతలు.

Ravi Batchali
About Ravi Batchali 18150 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*