
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అప్పులివ్వండి మహా ప్రభో అంటూ రిజర్వ్ బ్యాంక్ ముందు మోకరిల్లే దుస్థితి దాపురించింది. వచ్చేనెల జీతాలు, సంక్షేమ పథకాలకు ముప్ఫైవేలకోట్ల రూపాయలు సర్కార్ కి తక్షణం అవసరం. దీంతో ఎపి సర్కార్ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ కావాలని కోరనుంది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన ఖర్చులు ఎన్నికల ఏడాది కావడంతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల ఫలితంగా మితిమీరిన అప్పులు చేయక తప్పడం లేదు. ఒక పక్క రాబడి తగ్గి వ్యయం పెరిగిపోవడంతో దినదినగండం నూరేళ్లాయుష్షు గా ఎపి సర్కార్ బండి సాగడం ఆందోళన కలిగిస్తుంది.
ఇవీ అవసరాలు …
ఇప్పటికే ఎపి సర్కార్ పెడుతున్న ఖర్చులకు, చేస్తున్న దుబారా పై రిజర్వ్ బ్యాంక్ పదేపదే హెచ్చరికలు జారీచేసింది. అయినా ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం, వివిధ కార్పొరేషన్ ల ఆస్తులను చూపి తాజా అప్పులకు సిద్ధమైంది. వడ్డీ ఎంత అయినా ఇచ్చేది ఎవరైనా సరే ముందు వెనుక చూడకుండా అప్పు చేసి పప్పు కూడు కి సిద్ధమైంది ప్రభుత్వం. పెంచిన పెన్షన్లు తో కలిపి 8 వేలకోట్ల రూపాయలు అవసరం కాగా, డ్వాక్రా సంఘాలకు వేయనున్న పసుపు కుంకుమ తాయిలం 2400 కోట్ల రూపాయలు వరకు లెక్కకు వచ్చింది.
నిత్యం అప్పుల కోసం….
ఇక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై 12400 కోట్లు బిల్లులు రావలిసి ఉండగా 4800 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాలిసి వుంది. వచ్చే మార్చికి ప్రభుత్వానికి సమకూరుతాయని భావిస్తున్న నిధులు ఫిబ్రవరిలోనే ఆవిరౌతాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. దాంతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఆదాయ మార్గాలు, అప్పుల కోసం నిత్యం కసరత్తు ముమ్మరం చేయడం ప్రమాద ఘంటికలు మ్రోగిస్తుంది. ఇప్పటికే ఎపి సర్కార్ కి హెచ్చరికలపై హెచ్చరికలు చేసిన రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వం తాజాగా అడుగుతున్న అప్పుపై ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.
Leave a Reply