అనిత అలా డిసైడ్ అయ్యారు …!

vangalapudi anitha kovvur constiuency

విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్యెల్యే అనిత సీరియస్ గా తన నిర్ణయం ప్రకటించారు. పార్టీకి ప్రభుత్వానికి చంద్రబాబు పైనా వస్తున్న విమర్శలతో మనస్తాపానికి గురై అధినేతకు ఒక లేఖను స్వయంగా రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలుగా క్రైస్తవ మతస్థురాలిని ఎలా నియమిస్తారన్న హిందూ ధార్మిక సంస్థలు చేసిన ఆరోపణలతో అనిత ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రికి నేరుగా ఆమె రాసిన లేఖలో ఏమన్నారంటే …. తాను హిందూ మతస్థురాలినని, దళిత ఎస్సీ మహిళగా ఆమె పేర్కొన్నారు. తన ఇష్ట దైవం శ్రీవేంకటేశ్వరుడు అని చాలా సార్లు ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్ధనలు చేశానని తెలిపారు. స్వామి కి సేవ చేసుకునే అవకాశంతనకు ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తన పాత ఇంటర్వ్యూ భాగాలు ముందు వెనుక తీసి అల్లరి చేయడం చంద్రబాబుకి పార్టీకి ఇబ్బంది గా మారిన నేపథ్యంలో తనకు ఇచ్చిన పదవిని రద్దు చేయాలని ఆమె లేఖలో ముఖ్యమంత్రిని అభ్యర్ధించారు.

అనిత లేఖతో వివాదం సద్దుమణిగినా …

ఎమ్యెల్యే అనిత టిటిడి పాలకమండలి సభ్యురాలిగా ఇంకా పదవీస్వీకారం చేయలేదు. ఆమెను ప్రకటించిన వెంటనే గతంలో అనిత ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె పదవికి ఎసరు తెచ్చింది. అనిత వ్యవహారం టిడిపికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దాంతో ముఖ్యమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేసి నిజనిర్ధారణ చేయాలని నిర్ణయించారు. ఆ కమిటీ తన నిర్ణయం ప్రకటించకుండానే అనిత స్వచ్ఛందంగా తనకు ఇచ్చిన పదవిని వదులుకున్నారు. ఇదిలా ఉండగా అనిత చేత పార్టీ ఈ విధంగా బలవంతంగా రాజీనామా చేయించిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కార్మిక మంత్రి పితాని సత్యనారాయణ మీడియా తో మాట్లాడిన సందర్భంలో ఆమె ప్రమాణస్వీకారం చేయరని ముందే చెప్పేశారు. దీనిని బట్టి వీలైనంత త్వరగా అనిత వివాదానికి స్వస్తిపలకాలనే టిడిపి అధిష్టానం సీరియస్ గా యాక్షన్ ప్లాన్ లోకి దిగిందని తెలుస్తుంది. కానీ ఈ వివాదం రేపటి ఎన్నికల వరకు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ఇక ఛైర్మన్ పై మొదలైపోయింది …

టిటిడి బోర్డు ఛైర్మెన్ గా ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు పుట్టా సుధాకర యాదవ్ పై వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. క్రైస్తవ సంస్థలకు పుట్టా అండదండలు అందిస్తారని, ఆయన క్రైస్తవాన్నే అనుసరిస్తారంటూ సోషల్ మీడియా లో టిడిపి వ్యతిరేకులు, హిందూ ధార్మిక సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. సుధాకర యాదవ్ దీనిపై పలు సార్లు వివరణలు ఇచ్చినప్పటికీ ఆయనపై ఇంకా నెగిటివ్ ప్రచారం నడుస్తూనే వుంది. క్రైస్తవ సభలకు పోస్టర్లలో పుట్టా వున్న ఫోటోలను అదే పనిగా విడుదల చేస్తున్నారు కొందరు. అయితే ఇప్పటికే సుధాకర యాదవ్ విషయంలో వెనక్కి తగ్గడానికి ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా లేరు. యనమల నుంచి వున్న వత్తిడి కారణంగా యాదవ్ కొనసాగింపుకే సీఎం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గతంలో బిజెపితో పొత్తు వున్న సమయంలో పుట్టా పేరును ప్రకటించిచ వారినుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో బాబు వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఎన్డీయే నుంచి టిడిపి వైదొలిగాక చంద్రబాబు సుధాకర యాదవ్ పై జరుగుతున్న గోలను పక్కన పెట్టేశారు.

బిజెపిమంత్రి భార్య కు ఎలా ఇచ్చారు …

ఇదిలా ఉంటే బిజెపికి చెందిన మంత్రి సుధీర్ భార్య సప్నా సుధీర్ టిటిడి బోర్డు సభ్యురాలుగా నియామకం సైతం టిడిపి కి కొత్త్త తలపోటు తెచ్చిపెడుతుంది. బిజెపి పై తెగతెంపులు చేసుకున్నమని ప్రకటించి ఆ పార్టీ తో లోపాయికారిగా మైత్రి ని టిడిపి కొనసాగిస్తున్నట్లు తేలిపోయిందని సాక్ష్యాలతో సహా వైసిపి చూపిస్తుంది. దీన్ని ఎలా సమర్ధించుకోవాలనే అంశంపై పార్టీ వర్గాలు తేల్చుకోలేకపోతున్నాయి. ఒక పక్క ప్రధాని మోడీని, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లను నిత్యం విమర్శిస్తూ బ్యాక్ డోర్ లో భాయి భాయి అని కేసులకు భయపడి రాజీ పడుతున్నారని వైఎసార్సీపి విమర్శలు ఇప్పుడు జనంలోకి దూసుకుపోతున్నాయి. ఓట్ల కోసం వైసిపిని జగన్, విజయసాయి ప్రధానితో కలిసిపోయారంటూ మైండ్ గేమ్ ఆడుతున్న టిడిపి నేరుగా బిజెపికి టిటిడి బోర్డు లో పార్టీలో ఎవరు లేనట్లు పదవులు ఎలా ఇచ్చేసిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Ram Tatavarthi
About Ram Tatavarthi 1795 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*