
ఏపీ రాజకీయ పంచతంత్రంలో ఎవరి మంత్రం పారుతుంది..? చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారా..? ప్రజాసంకల్పయాత్ర జగన్ కలను నెరవేరుస్తుందా..? సుడిగాలిలా వచ్చిన పవన్ అజేయుడిగా నిలుస్తారా..? గత ఎన్నికల్లో పత్తాలేకుండా పోయిన కాంగ్రెస్ ఈసారి సత్తాచాటుతుందా..? ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాట తప్పిన బీజేపీ పరాభవం మూటగట్టుకోక తప్పదా..? ఏపీలో అనూహ్యంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్న రాజకీయంలో అజేయంగా నిలిచేందుకు ఈ ఐదు పార్టీలు ఏం చేయబోతున్నాయన్నదానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ఐదు పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో దాదాపుగా ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్డీయేపై బాబు ఉద్యమం…
ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం ప్రత్యేక హోదా సాధన అంశం చుట్టూ తిరుగుతోంది. ఈ విషయంలో ఎవరు ముందుంటారన్నదానిపైనే వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతోనే కేంద్రం నుంచి ఎన్డీయే నుంచి చంద్రబాబు బయటకు వచ్చి ఉద్యమిస్తున్నారు. ప్రధాని మోడీపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. బీజేపీ-వైసీపీ కుట్రరాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.
బాబును ఇరకాటంలో పడేసే స్కెచ్‌లో వైసీపీ…
ఇదే సమయంలో చంద్రబాబును ఇరకాటంలో పడేసేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. నమ్మకద్రోహం-కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం అంటూ టీడీపీ సభలు నిర్వహిస్తుంటే.. వంచన వ్యతిరేక దినం అంటూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. అయితే బీజేపీ నమ్మకద్రోహం చేసిందనీ, స్వార్థం కోసం బీజేపీ వైసీపీ లాలూచీ రాజకీయాలకు పాల్పడుతోందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో చంద్రబాబు కొంతమేరకు సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా….
రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలవలేదు. ఈసారిమాత్రం సత్తాచాటుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి చెబుతున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా స్పష్టత ఇవ్వడంతో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
పవన్ ప్రభావమెంత..?
ఇక కేంద్రంపైన కంటే.. రాష్ట్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభావం తప్పకుండా ఉంటుందని పలువురు నాయకులు అంటున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రిని అవుతానని పవన్ అంటున్నారు. పవన్ ప్రసంగాలు, పర్యటనలు ఎలా ఉన్నా జనసేనకు ఇంకా పొలిటికల్‌గా పూర్తిగా సత్తా చాటే స్కోప్ రాలేదు.
బోటాబోటీ తోనే గెలిచేది…
అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి కూడా భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు లేవని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా చెప్పొచ్చు. అయితే బీజేపీతో వైసీపీ అంటకాగుతుందనే వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ముస్లిం ఓటర్లు ఈసారి టీడీపీ లేదా.. కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ – వైసీపీ కలిసినా కలవకపోయినా ఈ సారి ముస్లిం ఓటర్లలో టీడీపీ- వైసీపీ మధ్య చీలక స్పష్టంగా కనపడుతోంది. ఇక కాపుల్లో మెజార్టీ వర్గం ఇప్పుడు జనసేన వైపు మొగ్గు చూపుతోంది. పవన్ ప్రభావంతో కాపుసామాజిక వర్గం ఓట్లు కూడా భారీగా చీలిపోయే అవకాశం ఉంది. ఇది టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నాయకులు అంటున్నారు. అయితే ఎవరు గెలిచినా కొద్దిపాటి తేడాతోనే ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాల్లో అనూహ్య మార్పులు వస్తాయని చెబుతున్నారు.
Leave a Reply