రివ్యూ: అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌

టైటిల్‌: అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌
బ్యాన‌ర్‌: హారిక & హాసిని క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, ఈషా రెబ్బా, జ‌గ‌ప‌తిబాబు, నాగ‌బాబు, సునీల్ త‌దిత‌రులు
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్ వ‌ర్క్‌: ఏఎస్‌.ప్రకాశ్‌
ఫైట్స్‌: రామ్ – ల‌క్ష్మణ్‌
సినిమాటోగ్రఫీ: పీఎస్‌.వినోద్‌
మ్యూజిక్‌: థ‌మ‌న్‌.ఎస్‌.ఎస్‌
నిర్మాత‌: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)
ర‌చ‌న – ద‌ర్శక‌త్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 167.30 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 11 అక్టోబ‌ర్‌, 2018
ప్రి రిలీజ్ బిజినెస్ : రూ. 93 కోట్లు

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లోనే ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ నుంచి ఎన్టీఆర్ ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. నాలుగు వ‌రుస హిట్లు… యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా క‌లెక్షన్లు మాత్రం దుమ్ము రేపుతున్నాయ్‌. ఇక దశాబ్ద కాలం నుంచి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా కోసం ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమాని క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. వీరి కోరిక ఎట్టకేల‌కు తీరే భాగ్యం వ‌చ్చేసింది. ఈ ఇద్దరి కాంబోలో ‘అరవింద సమేత’ తెరకెక్కింది. అర‌వింద స‌మేత‌పై ఎన్టీఆర్‌ అభిమానులకే కాకుండా సినీ వర్గాల వారికి కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ రాయలసీమ ఫ్యాక్షనిస్ట్‌గా కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న తొలిసారిగా పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం రెండు అద‌న‌పు షోలు వేసుకునేందుకు సైతం అనుమ‌తి ఇస్తూ సినిమాకు కావాల్సినంత జోష్ ఇచ్చింది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అవడంతో ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇటు నాలుగు వ‌రుస హిట్లతో ఉన్న ఎన్టీఆర్‌, అటు అజ్ఞాత‌వాసి లాంటి భారీ డిజాస్టర్ త‌ర్వాత త్రివిక్రమ్ క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో అర‌వింద ఎలా ఉంటుందా ? అన్న ఉత్కంఠ అంద‌రిలోనూ ఉంది. మ‌రి అర‌వింద స‌మేతుడు ఈ రోజు ప్రపంచ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. తెలుగు నాట అయితే వారం రోజుల ముందుగానే ద‌స‌రా క‌ళ తెచ్చేశాడు. మ‌రి అర‌విందుడు అంచ‌నాలు అందుకున్నాడా ? లేదా ? అన్నది తెలుగుపోస్ట్‌.కామ్ స‌మీక్షలో చూద్దాం.

స్టోరీ :

రాయ‌ల‌సీమ‌లోని కొమ్మత్తి అనే గ్రామంలో బ‌సిరెడ్డి (జగపతి బాబు ), నారప రెడ్డి ( నాగబాబు) వర్గాల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. నార‌ప‌రెడ్డి కుమారుడు వీర‌రాఘ‌వ‌రెడ్డి లండ‌న్‌లో చ‌దువుకుని స్వగ్రామం వ‌స్తాడు. వీర‌రాఘ‌వ‌రెడ్డిని అంత‌మొందించేందుకు బ‌సిరెడ్డి వ‌ర్గం చేసిన దాడిలో నార‌ప‌రెడ్డితో పాటు ఆయ‌న అనుచ‌రులు చ‌నిపోతారు. ఈ గొడ‌వ‌ల‌కు దూరంగా వీర‌రాఘ‌వ‌రెడ్డి సిటీకి వెళ‌తాడు. అక్క‌డ వీరారాఘ‌వ‌కు నీలాంబ‌రి (సునీల్‌) ప‌రిచ‌యం అవుతాడు. ఈ క్రమంలోనే వీర‌రాఘ‌వుడికి అర‌వింద (పూజా హెగ్డే)తో ప‌రిచ‌యం ఏర్పడుతుంది. సీమ‌లో ఫ్యాక్షనిజానికి చ‌ర‌మ‌గీతం పాడి… అక్కడ శాంతియుత వాతావరణం కోసం పోరాడే వీర రాఘవ అనుకున్నది సాధించాడా ? ఫ్యాక్షన్ వల్ల అత‌డు ఏం కోల్పోయాడు ? చివ‌ర‌కు త‌న ల‌క్ష్యం నెర‌వేరిందా ? అర‌వింద‌తో అత‌డి ప్రేమాయ‌ణం ఎలా ముగిసింది ? అన్న ప్రశ్నల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.

క‌థ‌నం, విశ్లేష‌ణ :

రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో యుద్ధం జ‌రిగాక కాదు.. యుద్ధం రాకుండా ఆపిన‌వాడే గొప్పోడు అనే మెసేజ్ లైన్‌తో ఈ సినిమా న‌డుస్తుంది. సినిమా ప్రారంభంలోనే 25 నిమిషాల పాటు ఆస‌క్తిక‌రంగా స్టార్ట్ అవుతుంది. సీమ‌లో ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఎలా ఉంటాయి…. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ లండ‌న్ నుంచి వ‌స్తున్న టైంలో ప్రత్యర్థులు మాటువేసి ఎన్టీఆర్ తండ్రి నార‌పురెడ్డితో పాటు అనుచ‌రుల‌ను చంపేస్తారు. ఆ త‌ర్వాత క‌థ దాదాపు అరగంట పాటు చాలా స్లో అయ్యింది. ముందుగా ఎన్టీఆర్ – పూజా హెగ్డేతో పాటు, బెయిల్ కోసం వ‌చ్చే గ్యాంగ్‌తో పూజా తండ్రి సీనియ‌ర్ న‌రేష్‌తో చేసిన కామెడీ ట్రాక్ ఆక‌ట్టుకోలేదు. అక్కడే 15 నిమిషాల టైం వేస్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత ట్రాక్‌లోకి వ‌చ్చిన క‌థ కాస్త ఊపందుకుంటుంది. ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌చ్చే స‌న్నివేశాల‌తో పాటు ఇంట‌ర్వెల్ బ్యాంగ్ హైలెట్‌. సెకండాఫ్ సైతం స్లోగా స్టార్ట్ అయినా ఆ త‌ర్వాత ఎన్టీఆర్ – పూజ స‌న్నివేశాలు, ఎన్టీఆర్‌, రావూ ర‌మేష్‌తో మాట్లాడే సీన్‌, ఎన్టీఆర్ – న‌వీన్‌చంద్ర మీటింగ్‌తో పాటు అక్క‌డ వ‌చ్చే ఫైట్లు బాగున్నాయి. ఇక ఫ్యాక్షన్ సినిమాల్లో కొత్త కోణాన్ని చూపెట్టడంలో త్రివిక్రమ్ స‌క్సెస్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ స్టైల్లో ఫ్యాక్షన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ? అర‌వింద అలాగే ఉంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్‌లోని హీరోయిజం ఎలివేట్ చేసేందుకు ఏ మ‌త్రం ఇష్టప‌డ‌లేదు. హీరోయిజం క‌థ‌ను డామినేట్ చేయ‌కుండా కేవ‌లం క‌థ‌ను , అందులో పాత్రలు, సందేశం హైలెట్ చేస్తూ త్రివిక్రమ్ సినిమాను తెర‌కెక్కించారు. ఫ్యాక్షనిజాన్ని శాంతి కోణంలోనూ చూపించ‌డం త్రివిక్రమ్‌కే చెల్లింది.

న‌టీన‌టుల విశ్లేష‌ణ :

ఎన్టీఆర్ మ‌రోసారి సెటిల్ట్ పెర్పామెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. అయితే ఎన్టీఆర్ ఇటీవ‌ల వ‌రుస‌గా సెటిల్ట్ పెర్పామెన్స్‌లే చేస్తున్నాడు. కాస్త మ‌సాలా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఒక‌ప్పుడు వ‌రుస‌గా మాస్ సినిమాల‌తో బోర్ కొట్టించిన ఎన్టీఆర్ ఇప్పుడు వ‌రుస‌గా సెటిల్డ్ పెర్పామెన్స్‌లే చేయ‌డంతో ఆయ‌న మాస్ వీరాభిమానులు కాస్త మ‌సాలా ఆశించ‌డంలో త‌ప్పులేదు. ఇక న‌ట‌న ప‌రంగా చిన్న వంక పెట్టలేని విధంగా చేశాడు. భావోద్వేగ స‌న్నివేశాల్లో ఎన్టీఆర్ న‌ట‌న చూస్తే ఈ త‌రం హీరోల్లో అత‌డిని గొప్పన‌టుడిగా ఎందుకు చెపుతారో… మిగిలిన కుర్ర హీరోల‌లో అత‌డిని ఎందుకు ప్రత్యేకంగా చూస్తారో తెలుస్తుంది. ఈ సినిమాలో పాత్రలే హైలెట్‌. ఎన్టీఆర్ నటన ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అతి సాదాసీదా స‌న్నివేశాల‌ను కూడా త‌న న‌ట‌న‌తో ఎలివేట్ చేశాడంటే అది ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. అదే స‌న్నివేశం మ‌రో హీరో చేస్తే ప్రేక్షకులు ఎంత మాత్రం క‌నెక్ట్ కారంటే అతిశ‌యోక్తి కాదు. మాములు సన్నివేశాలను కూడా తన నటనతో ఎలివేట్ చేశాడు. సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడు.

అందరూ తమ పాత్రలకు….

హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర లిమిట్‌గానే ఉన్నా త‌న వ‌ర‌కు న్యాయం చేసింది. ఇంకా చెప్పాలంటే టైటిల్‌కు త‌గిన క్యారెక్టర్ కాదు. మ‌రో హీరోయిన్ ఈషా రెబ్బా పూజ చెల్లిగా మూడు సీన్లలో మురిపించింది. విల‌న్‌గా న‌టించిన‌ విలక్షణ నటుడు జగపతి బాబు తన కెరీర్ లో మరో గుర్తిండిపోయే పాత్ర చేసి మెప్పించారు. జ‌గ‌ప‌తిబాబు త‌న‌యుడిగా చేసిన న‌వీన్‌చంద్రకు కూడా మంచి పాత్రే వ‌చ్చింది. ఇత‌ర పాత్రల్లో చేసిన రావూ ర‌మేష్‌, శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌, దేవయానీ , సితార , సుప్రియ పథక్ వారి పాత్రల మేర చక్కగా నటించారు. చాల ఏళ్ల త‌ర్వాత హీరో నుంచి కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్ కూడా తన పాత్రతో హాస్యాన్ని అందించలేకపోయాడు. సునీల్ కామోడీ చేసే స్కోప్ లేదు… చేసినా న‌వ్వువ రాలేదు. సునీల్ కంటే శ్రీనివాస్‌రెడ్డే బెట‌ర్ అనిపించాడు.

సాంకేతికత :

సాంకేతికంగా ఈ సినిమాకు ప‌ని చేసిన వారంద‌రూ మంచి ఎఫ‌ర్ట్ పెట్టారు. అన్ని విభాగాల్లో ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ క‌థ‌, ద‌ర్శక‌త్వం, క‌థ‌నం క‌న్నా కూడా మాట‌లు సినిమాను నిల‌బెట్టాయి. ప్రతి ఒక్క సీన్‌లో వ‌చ్చే ప్రతి డైలాగ్ ఎంతో డెప్త్‌తో ఆలోచింప‌జేసేలా ఉంది. అర‌వింత స‌మేత వీర‌రాఘ‌వ ఎమోష‌న‌ల్‌గాను, డైలాగుల ప‌రంగాను చాలా లోతుగా ఉంది. పీఎస్‌.వినోద్ సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉన్నా… కొన్ని చోట్ల లైటింగ్ త‌క్కువైన‌ట్టు ఉంది. ఇక థ‌మ‌న్ పాట‌లు తేలిపోయాయి… డ్యాన్సుల‌కు స్కోప్ లేదు. ఇక రామ్ – లక్ష్మణ్ ఫైట్లు మ‌రీ కొత్తగా లేక‌పోయినా ఎన్టీఆర్ చేసిన తీరు కొత్తగా ఉంది. ఏఎస్‌.ప్రకాష్ ఆర్ట్ వ‌ర్క్ సీమ సీన్ల‌లో సీమ వాతావ‌ర‌ణాన్ని ప్రతిబింబించేలా ఉంది. నూలి న‌వీన్ ఎడిటింగ్‌లో ఫ‌స్టాఫ్‌లో క‌త్తెర‌కు ప‌ని చెప్పలేద‌నిపించింది. ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే కామెడీ సీన్ల‌ను రెండు మూడు సార్లు రిపీట్‌గా చూపించ‌డంతో టైం వేస్ట్ అయ్యింది. చిన‌బాబు నిర్మాణ విలువ‌లు మ‌రీ అంత గొప్ప‌గా లేవు. సినిమాకు అంత ఖ‌ర్చు లేదు.

త్రివిక్ర‌మ్ ఎలా తీశాడంటే…

రాయ‌ల‌సీమ‌లో మ‌నం ఇప్పటి వ‌ర‌కు ఫ్యాక్ష‌నిజాన్ని మ‌గాళ్ల కోణంలోనే చూశాం… అయితే దానిని మ‌హిళ‌ల కోణంలో కూడా చూడాల‌ని త్రివిక్రమ్ ఇచ్చిన సందేశం ప్రతి ఒక్క‌రిని ఆలోచింప‌జేసేలా ఉంది. త్రివిక్రమ్ మంచి లైన్ తీసుకుని… చాలా చోట్ల సాగ‌దీసినా సూప‌ర్బ్ అనిపించాడు. ఒక‌డిని చంపాల‌ని వ‌చ్చిన వాడిని కూడా హీరో చెప్పిన మాట‌ల‌తో వాడిని వాడు ప్రశ్నించుకుని తిరిగి వెళ్లిపోయేలా హీరోతో చెప్పించిన డైలాగులు చాలా హైలెట్‌. న‌న్ను చంపితే నీ జీవితం బాగుండొచ్చు… కానీ న‌న్ను వ‌దిలి నీ ఇంటికి వెళితే నీ జీవితం ఇంకా బాగుంటుంద‌న్న కోణంలో క‌న్విన్సింగ్ ఉన్న సీన్లు మ‌న‌స్సుల‌ను హ‌త్తుకున్నాయి. ప్ర‌తి ఒక్క‌రిని… ముఖ్యంగా ఫ్యాక్షన్ గురించి తెలిసిన వారిని బాగా ఆలోచింప‌జేస్తాయి. ఒక విష‌యంలో మార్పు గురించి ఒక‌టో రెండో సీన్లలో చాలా మంది ముగిస్తారు… కానీ ఒక మార్పు కోసం సినిమా అంతా న‌డిపించ‌డం అనేది…. అది కూడా కామెడీ, హీరోయిజానికి స్కోప్ లేకుండా న‌డిపించ‌డం…. బోర్ కొట్టకుండా అనేది క‌త్తిమీద సాములాంటిదే. మెరుపులు, అరుపుల కోసం ఆశ‌ప‌డ‌కుండా ప్రతి ఒక్కడి జీవితంలో భావోద్వేగాలుంటాయి… అవి ఎలా ఉంటాయ‌న్న కోణంలో ప్రేక్షకుడు చూస్తే సినిమా చాలా బాగుంటుంది. ఫ్యాక్షన్‌ అంటే వ‌ధ‌, వ్యధే అనుకున్నాం… ఇవే కాదు అక్కడ శాంతి విర‌జిల్లితే వారి జీవితాలు ఎలా ఉంటాయో త్రివిక్రమ్ చ‌క్కగా చూపించాడు.

ప్ల‌స్‌లు (+) :

– ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ యాక్టింగ్‌
– సెకండాఫ్‌
– బ‌ల‌మైన భావోద్వేగంతో కూడిన క్లైమాక్స్‌
– మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యాక్షన్ స్టోరీ
– ఫ‌స్టాఫ్ 25 నిమిషాల ప్రారంభం

మైన‌స్‌లు (-):

– స్లో స్లో నెరేష‌న్‌
– ఫ‌స్టాఫ్‌
– కామెడీ లేక‌పోవ‌డం

ఫైన‌ల్‌గా….

త్రివిక్రమ్ స్టైల్ ఫ్యాక్షన్ + ఎమోష‌న‌ల్ డ్రామా

 
తెలుగుపోస్ట్ రేటింగ్‌: 3.0/ 5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*