
రాజుగారి కూతళ్లొచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోయారు. విజయనగరం సామ్రాజ్యం అంటేనే గజపతి రాజుల కుటుంబం గుర్తుకు వస్తుంది. అయితే ఆనందగజపతిరాజు, అశోక్ గజపతిరాజులకు కుమారులు లేరు. కుమార్తెలు మాత్రమే ఉన్నారు. రాజకీయ వారసత్వాన్ని ఇన్నాళ్లూ ఎవరు అందుకుంటారన్న సందిగ్దతకు తెరదించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన శత్రువుగా భావిస్తున్న భారతీయ జనతాపార్టీలోకి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత చేరడంతో రాజు గారి కుటుంబంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
పూసపాటి కుటుంబంలో…..
పూసపాటి కుటుంబానికి విజయనగరం జిల్లాలో తిరగలేదు. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న కుటుంబం కావడంతో ఇక్కడ ప్రజలు కూడా వీరిని ఆదరిస్తూ వస్తున్నారు. ఆనందగజపతి రాజు మరణించగా ఆయన కుమార్తె సంచయిత ఇప్పటి వరకూ రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదు. సంచయిత ఆనంద గజపతిరాజు, ఉమా గజపతిరాజుల కుమార్తె. ఉమా గజపతిరాజు ఒకప్పుడు విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. సంచయిత కొన్నాళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విశాఖ జిల్లాలో పట్టు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి ఆశయాలతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆమె చెబుతున్నారు.
ఆదితి తండ్రి వారసత్వాన్ని…..
ఇక అశోక్ గజపతి రాజు కుమార్తె ఆదితి ఇప్పటికే తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నారు. అశోక్ గజపతిరాజు పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా మొన్నటి వరకూ ఉండటంతో జిల్లా పార్టీ రాజకీయాల్లో ఆమె ముఖ్య పాత్ర పోషించారు. వచ్చే ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆదితి ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి అశోక్ గజపతి రాజు కూడా ఓకే చెప్పారు. తాను విజయనగరం ఎంపీగా, కూతురు ఆదితిని విజయనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ నేత కోలగట్ల వీరభద్రస్వామి దూసుకుపోతున్నారు. జగన్ కూడా ఆయనను అభ్యర్థిగా ప్రకటించడంతో కోలగట్లను ఢీకొట్టాలంటే అశోక్ గజపతిరాజుతోనే సాధ్యమవుతుందని అధిష్టానం భావిస్తోంది.
ఆనంద గజపతి కుమార్తె…..
ఇదిలా ఉంటే భారతీయ జనతాపార్టీలో చేరిన ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయితను ఎక్కడ నుంచి పోటీ చేయించాలన్న దానిపై బీజేపీ నేతలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సంచయిత తల్లి ఉమా గజపతిరాజు విశాఖ నుంచి పోటీ చేసి గతంలో గెలవడంతో ఆమె విశాఖ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే విశాఖలో ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరిస్తేనే సంచయితకు విశాఖ టిక్కెట్ దక్కుతుంది. లేదంటే విజయనగరం పార్లమెంటు నుంచి పోటీ చేయించాలన్నదే బీజేపీ పెద్దల ఆలోచన. సంచయిత ఊహించని విధంగా ప్రత్యర్థి పార్టీలో చేరడంతో అశోక్ కుటుంబంలో కొంత చర్చ బయలుదేరింది. సంచయితకు పోటీగా ఆదితిని కూడా వచ్చే ఎన్నికలలో అరంగేట్రం చేయించాలని అశోక్ డిసైడ్ అయ్యారని పూసపాటి కోట నుంచి విన్పిస్తున్న టాక్. మొత్తం మీద రాజుగారి కూతుళ్లు రాజకీయాల్లోకి దిగేందుకు సిద్ధమయ్యారు. మరి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.
Leave a Reply