
రాజకీయాలు అంటేనే సమర్ధతతో పాటు అద్రుష్టం కూడా కలసిరావాలని అంటారు. ఎంతటి గొప్ప వారు అయినా దశ లేకపోతే పదవులు వరించవు. ఇక విశాఖ జిల్లాలో ఆ ఇద్దరి విషయంలో ఇపుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం అంటే 1999 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ ఎంపీగా రాజకీయ అరంగేంట్రం చేసిన గంటా శ్రీనివాసరావుకు అయిదేళ్ళకే మంత్రి కావాలని కోరిక పుట్టింది. కానీ ఆ కల సాకారం కావడానికి పన్నెండేళ్ళు పట్టింది. అదీ మూడు పార్టీలు మారి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా గంటా కుదురుకోగలిగారు. మరి ఆయన రాజకీయ శిష్యునిగా ఉన్న అవంతి మాత్రం మంత్రి పదవిని పదేళ్ళకే సాధించి గురువుని మించిన శిష్యుడనిపించుకున్నారు.
పార్టీలు మారితేనే….
ఇక ఇద్దరు నాయకుల విషయం తీసుకుంటే ఉన్న పార్టీలో అవకాశం లేక పార్టీలు మారి మరీ తమ కోరికను తీర్చుకున్నారు. గంటా ప్రజారాజ్యంలో చేరి అక్కడ అధికారం రాక కాంగ్రెస్ లో విలీనం తరువాత 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రి అయ్యారు. ఆ తరువాత తిరిగి టీడీపీలో చేరి నిన్నటి ఎన్నికల వరకూ అయిదేళ్ళ పాటు మంత్రి యోగాన్ని గంటా అనుభవించారు. ఇపుడు ఆయన శిష్యుడు అవంతి శ్రీనివాసరావు శకం మొదలైంది. ఆయన మంత్రిగా వెంటనే అందుకున్నారు. గంటాలాగానే ఉన్న పార్టీ టీడీపీని వీడి వైసీపీలో చేరితేనే తప్ప ఆయనకు అవకాశం దక్కలేదు. ఆ విధంగా ఇద్దరు నేతల మధ్య పోలికలు చాలానే ఉన్నాయని అంటున్నారు.
ఓటమి ఎరుగని నైజం….
ఇక ఈ ఇద్దరి నేతల్లో మరో గొప్ప విషయం ఉంది. ఇప్పటికి గంటా ఒక సారి ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు. పార్టీలు మారినా, అసెంబ్లీ సీట్లు మార్చినా కూడా ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఇక అదే వరసలో అవంతి కూడా పదేళ్ళ రాజకీయ ప్రస్తానంలో నాలుగు పార్టీలు మారారు. భీమిలీ, అనకాపల్లి, మళ్ళీ భీమిలీ ఇలా రాజకీయ చక్కర్లు కొట్టారు. అయినా సరే జనం ఆయన్ని ఆదరించారు. పార్టీ ఏదైనా, ఎక్కడ పోటీ చేసినా అవంతి కూడా విజేతగా ఉండడమే కాదు, గంటా మాదిరిగా మంత్రి కూడా అయిపోయారు. మొత్తానికి చూసుకుంటే గురు శిష్యులిద్దరూ రాజకీయాల్లో లక్కును తొక్కారని సెటైర్లు పడుతున్నాయి.
Leave a Reply