
రాష్ట్రంలోనే హై ఓల్టేజీ ఉన్న నియోజకవర్గం గుడివాడ. గుడివాడ పేరు చెబితే ఎన్టీరామారావు తొలుతు గుర్తుకు వస్తారు. తర్వాత ఎవరు అవునన్నా…కాదన్నా.. కొడాలి నాని మాత్రమే గుర్తుకు వస్తారు. టీడీపీ కంచుకోటను తన డెన్ గా చేసుకున్నారు కొడాలి నాని. అప్రతిహతంగా గెలుస్తూ తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకూ అక్కడ టీడీపీ జెండాయే ఎగిరింది. ఒక్కసారి మాత్రమే కాంగ్రెస గెలిచింది. అటువంటి నియోజకవర్గం లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రయోగానికి సిద్ధమయింది.
నానిని దెబ్బకొట్టాలని….
కొడాలి నానిని ఓడించాలన్న ధ్యేయంగానే అభ్యర్థి ఎంపిక జరిగిందని చెప్పక తప్పదు. గుడివాడ టీడీపీకి దశాబ్దాకాలంగా అండగా ఉంటుంది రావి కుటుంబం. వారిని కాదని విజయవాడ నుంచి దేవినేని అవినాష్ ను బరిలోకి దింపాలని తెలుగుదేశం అధినేత నిర్ణయించారు. దేవినేని నెహ్రూ వారసుడైన అవినాష్ తన అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన దేవినేని అవినాష్ రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో ఓటమి పాలయ్యారు. నెహ్రూ తర్వాత టీడీపీలో చేరారు. నెహ్రూ మరణం తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా విజయవాడ సిటీ నుంచి పోటీ చేయాలని భావించారు.
అసంతృప్త నేతలకు ఆఫర్లు….
కానీ అప్పటికే అక్కడ హౌస్ ఫుల్ అవ్వడంతో అవినాష్ ను గుడివాడకు పంపాలని నిర్ణయించారు. అవినాష్ అభ్యర్థిత్వాన్ని రావికుటుంబంతో పాటు కొందరు టీడీపీ నేతు కూడా వ్యతిరేకించారు. అయితే నానిని ఓడించాలంటే కలసి కట్టుగా పనిచేయాలని స్వయంగా చంద్రబాబు వారిని బుజ్జగించారు. రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి, మరో నేత యలవర్తి శ్రీనివాసరావుకు నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి అవినాష్ విజయానికి కృషి చేయాలని చెప్పి పంపారు. అవినాష్ టిక్కెట్ ఖారరయిన వెంటనే మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కఠారి ఈశ్వర్ కుమార్ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అయితే గుడివాడలో పట్టున్న కొడాలిని ఓడించాలంటే అవినాష్ ఏటికి ఎదురీదటమేనన్నది అక్కడి నేతలు అంటున్నారు.
భారీ బెట్టింగ్ లు….
గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గత కొన్నేళ్లుగా చంద్రబాబును టార్గెట్ గా చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడిగా ఉన్న కొడాలి నాని చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. ఇక దేవినేని అవినాష్ కూడా వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు సంధిస్తూ ముందుకు వెళుతున్నారు. దీంతో పోలింగ్ తేదీకి ఇంకా నెల రోజులు సమయమున్నా అప్పుడే ఈ నియోజకవర్గంలో బెట్టింగ్ లు ఊపందుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపోటములపై ఇప్పటికే లక్షల్లో బెట్టింగ్ లకు సిద్ధమయ్యారు. ఎప్పుడైనా పోలింగ్ జరిగిన తర్వాత బెట్టింగ్ లు జరుగుతాయి. కానీ గుడివాడలో మాత్రం అభ్యర్థులు ఖరారయిన వెంటనే బెట్టింగ్ ల జోరు అందుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు.
Leave a Reply