ఇక వీరికి కాలం చెల్లినట్లేనా…!!

bharathiya-janatha-party-in-andhrapradesh

ఏపీలో బీజేపీ పరిస్థితిపై హై కమాండ్ ఒక అంచనాకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. అయిదేళ్ళ పాటు టీడీపీతో అంటకాగినా కూడా పార్టీ బలపడకపోగా చివరి నిముషంలో చంద్రబాబు చేసిన దుష్ప్రచారానికి బలైపోయింది. ఎన్నడూ లేని విధంగా నోటా కంటే తక్కువ ఓట్లు లభించాయి. తాజా ఎన్నికల్లో .87 శాతంతో రెండు లక్షల పై చిలుకు ఓట్లు దక్కాయి. దాంతో ఏపీపై కమలనాధులు ఇప్పట్లో పెద్దగా ఆశలు పెట్టుకోవడంలేదు. ప్రయోగాలు కూడా చేసేందుకు సిధ్ధంగా లేరని తెలుస్తోంది. ఇక్కడ చంద్రబాబు ఓటమి పాలు కావడం బీజేపీకి మిగిలిన ఏకైక ఆనందంగా చెప్పుకోవాలి. ఇక ఏపీలో గత అయిదేళ్ళుగా ఉన్న నాయకులెవరూ క్రౌడ్ పుల్లర్లు కారని తేలిపోయింది. ఏరి కోరి అన్న నందమూరి తనయ దగ్గుబాటి పురంధేశ్వరికి పెద్ద పీట వేసినా ఆమెకు సొంతంగా ఓట్ బ్యాంక్ లేదని విశాఖలో డిపాజిట్ గల్లంతు కావడంతో బోధపడిపోయింది. సీనియర్ నేతలెవరూ కూడా పార్టీని పైకి లేపేందుకు పెద్దగా ఉపయోగపడరని కూడా అర్ధమైంది.

ఆశలు ఆవిరేనా…?

బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యసభ సభ్యత్వంతో శేష జీవితం గడపాలనుకుంటున్న వారికి హై కమాండ్ కఠిన వైఖరి నిరాశను కలిగిస్తోంది. పురంధేశ్వరి మాట తీసుకుంటే ఆమెను బీజేపీ ఎంతో గౌరవించి జాతీయ మహిళా మోర్చా ఇంచార్జి గా కీలకమైన బాధ్యతను అప్పగించారు. అయితే ఆమె ఏపీలో పార్టీ బలోపేతానికి పెద్దగా కృషి చేసింది లేదు. ఇక విశాఖ ఎంపీ సీట్లో పోటీని ఆషామాషీగా తీసుకున్నారు. నోటా కంటే రెట్టింపు ఓట్లు మాత్రం తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. ఈ రకమైన పనితీరుతో ఆమె రాజ్యసభ సీటు ఎలా కోరతారని పార్టీలో ఇతర నేతలే అంటున్నారు. అన్న నందమూరి వారసురాలిగా ఆమెను జనం గుర్తించలేదనడానికి డిపాజిట్ గల్లంతు కావడం పెద్ద ఉదాహరణగా చెబుతున్నారు.

సభ్యత్వం వరకే….

ఇక ఏడాది క్రితం వరకూ అటు విశాఖ ఎంపీగా, ఇటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చక్రం తిప్పిన హరిబాబు ఇపుడు ఎటూ కాకుండా అయిపోయారు. ఆయనకు విశాఖ ఎంపీ టికెట్ నిరాకరించారు. ఆయన సైతం పార్టీ విజయానికి పెద్దగా కృషి చేయలేదని రిపొర్ట్ వెళ్ళిపోయింది. ఇక ఆయన బీజేపీ అధ్యక్షునిగా చంద్రబాబు సర్కార్ తో దోస్తీ చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని హై కమాండ్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. దాంతో రాజ్యసభ సీటు ఇచ్చి జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటారనుకున్న హరిబాబుకి కూడా చెక్ పెట్టేసినట్లైంది. ఇదే విధంగా సీనియర్ నేతలు కృష్ణంరాజు, కావూరి సాంబశివరావు వంటి వారికి ఇక బీజేపీలో మర్యాద తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయంటున్నారు. ఇతర పార్టీల నుంచి నేతలను రప్పించుకోవడం ద్వారానే పార్టీని పటిష్టం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ ఉన్నట్లుగా చెబుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 18718 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*