వన్ సైడ్ జరిగితే?

బీజేపీ

ఈ నెల 21న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే అందరి దృష్టి మహారాష్ట్ర మీదనే ఉంది. ఇందుకు కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. యూపీ తర్వాత లోక్ సభ స్థానాల పరంగా మహారాష్ట్ర(48) దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రం. శాసనసభ స్థానాల పరంగా చూసినట్లయితే యూపీ, పశ్చిమ బెంగాల్, తరువాత మూడో అతిపెద్ద (288) రాష్ట్రం యూపీలో 400 కు పైగా, బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్ర రాజధాని ముంబయి నగరం దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు వంటిది. రిజర్వుబ్యాంక్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల కేంద్ర కార్యాలయాలు ఇక్కడే కొలువై ఉన్నాయి. దీంతో సాధారణ ప్రజలతో పాటు కార్పోరేట్ వర్గాలు కూడా ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తాయి. ఆ మాటకు వస్తే వివిధ పార్టీలకు వీటి స్థాయిని బట్టి ఎన్నికల ఖర్చును సమకూర్చేది కార్పోరేట్ వర్గాలేనన్నది కాదనలేని సత్యం.

సొంతంగా అధికారాన్ని చేపట్టేందుకు…..

ఇక రాజకీయ పరంగా చూసిన మహారాష్ట్రలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్.సి.పి రంగస్థలంపై ఉన్నాయి. సొంతంగా అధికారం చేపట్టే శక్తి ఏ పార్టీకి లేదు. భావసారూప్య పరంగా బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఒకే గూటి పక్షులు. అంతమాత్రాన వాటి మధ్య పర్పస్పర అవగాహన, విశ్వాసం ఉందా అనుకుంటే పొరపాటే. శివసేన బీజేపీని, ఎన్సీపీ కాంగ్రెస్ పెద్దన్నగా పరిగణిస్తాయి. ఎక్కడ తమను దెబ్బతీస్తాయో అన్నది ప్రాంతీయ పార్టీల భయం. ఈ అనుమానంతోనే 2014 ఎన్నికల్లో నాలుగు పార్టీలు వేర్వేరుగా పోటీచేసి చేతులు కాల్చుకున్నాయి. ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. 120కి పైగా స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ చివరికి శివసేన మద్దతుతో సంకీర్ణసర్కారును ఏర్పాటు చేసింది. అయిదేళ్లపాటు వీటి మధ్య కలహాల కాపురం సాగింది. ఈ చేదు అనుభవవాల నేపథ్యంలో ఈ సారి అన్ని పార్టీలు ప్రాప్త కాలాజ్ఞతను ప్రదర్శించాయి.

బలంగా కన్పిస్తున్న….

బీజేపీ, సేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. సీట్ల సర్ధుబాటు జరిగిపోయింది. రాజకీయంగా చూస్తే బీజేపీ, సేన కూటమి బలంగా ఉన్నట్లు కనపడుతోంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 23, శివసేన 18 స్థానాలు సాధించి స్పష్టమైన ఆధిక్యత కనబరిచాయి. శరత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ నాలుగు సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ ఒక్క నాందేడ్ స్థానానికి పరిమితమైంది. బీజేపీ 27.59, శివసేన 23.29, కాంగ్రెస్ 16.27, ఎన్సీపీ 15.52 శాతం ఓట్లు సాధించాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122, (27.8శాతం), శివసేన 63 ( 19.3శాతం), కాంగ్రెస్ 42 (18శాతం),ఎన్సీపీ 41 (17.2 శాతం) సీట్లు సాధించాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో సాధించిన స్థానాల పరంగా చూస్తే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి 230 స్థానాలు సాధించినట్లు చెప్పుకోవచ్చు. అంతకానప్పటికీ తమ విజయం తథ్యమని కూటమి ధీమాగా ఉంది.

అనుకూల అంశాలు…..

ముఖ్యమంత్రి షడ్నవిస్ ను మార్చకపోవడం, అవినీతి రహిత పాలన, మోడీ ప్రభావం, హిందువులు ఆదిక్యంగా గల రాష్ట్రంలో 370 అధికరణ రద్దు తదితర అంశాలు తమను విజయతీరాలకు చేరుస్తాయని కమలం, శివసేన శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో దాదాపు 30 మంది తాజా, మాజీ ఎమ్మెల్యేలు ఈ రెండు
పార్టీల్లో చేరారు. గత అయిదేళ్ల రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలను ఇరుకున పెట్టిన శివసేన లోక్ సభ ఎన్నికల్లో మోడీ గాలి వీయడంతో ఇప్పుడు వెనక్కి తగ్గింది. శివసైనికుణ్ని సీఎంగా చేయాలన్న తన తండ్రి బాల్ ఠాక్రే లక్ష్యాన్ని సాధిస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అది అసాధ్యమన్న సంగతి ఆయనకు తెలుసు. మోడీ హవాలో బీజేపీ తమను చిన్న చూపు చూస్తుందన్న అనుమానం, ఆవేదన శివసేన లో లేకపోలేదు. అయినప్పటికీ చేసేదేమి లేక మౌనంగా సర్దుకుపోతుంది.

ఆశలు లేకపోయినా….

ఇక కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కష్టాల కడలిలో ఈదుతోంది. దశాబ్ధాలపాటు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ కుదేలైంది. మరాఠా దిగ్గజం శరద్ పవార్ చిక్కుల్లో ఉన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పవార్ వృద్ధాప్యంలో ఉన్నారు. గతంలో మాదిరిగా పార్టీని సమర్థంగా నడపలేకపోతున్నారు. ఈడీ ఆయనపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయడంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పీసీసీ చీఫ్ అశోక్ చవాన్ ఇప్పుడిప్పుడే శక్తిని కూడదీసుకుంటున్నారు. మాజీ సీఎం, మాజీ కేంద్ర హోంమంత్రి ఎస్బీ చంద్ కుమారుడైన అశోక్ చవాన్ ఒక్కరే ఇటీవల లోక్ సభ (నాందేడ్ నియోజకవర్గం) గెలిచారు. 1999 నుంచి 2014 వరకు మూడుసార్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి ఈ ఎన్నికలపై పెద్దగా ఆశలు లేవు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, బీజేపీ సేన కూటమి లుకలుకలు తమకు మేలు చేస్తాయన్న ఆశాభావంతో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత, ఇటీవలి వరదలు, మరట్వాడా ప్రాంతంలో కరవు పరిస్థితులు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, యువతలో అసంతృప్తి తదితర అంశాలు ప్రజలను ప్రభావితం చేస్తాయన్న అంచనాతో ఉంది. ఏది ఏమైనా బీజేపీ, సేన కూటమికి ఎదురొడ్డటం అంత తేలిక కాదన్న సంగతిని విస్మరించకపోవడం గమనార్హం.

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 25505 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*