మోదీతో ముందు..ముందు…?

తేయాకు

ఒకప్పటి జనసంఘ్… 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినప్పుడు ఆ పార్టీపై వివిధ రకాల వ్యాఖ్యానాలు…విమర్శలు విన్పించాయి. ఇది ఉత్తరాది పార్టీ అని, హిందుత్వ పార్టీ అని, అగ్రవర్గాల పార్టీ అని…. వింధ్యకు ఆవల (దక్షిణాది) దాని ప్రభావం శూన్యమని విమర్శలు విన్పించాయి. ఇందుకు తగినట్లుగానే పార్టీ ప్రస్థానం సాగింది. పార్టీ ఆవిర్భావం అనంతరం 1984 నవంబరు, డిసెంబర్ లలో జరిగిన ఎన్నికల్లో పార్టీ కేవలం రెండే రెండు సీట్లు సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ జిల్లా హన్మకొండ, గుజరాత్ లోని ఒకచోట పార్టీ గెలుపొందింది. హన్మకొండలో కాంగ్రెస్ అభ్యర్థి పి.వి.నరసింహారావును బీజేపీ అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డి ఓడించారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నుంచి పోటీ చేసిన అటల్ బిహారీ వాజ్ పేయి పరాజయం పాలయ్యారు. ఎందరో హేమాహేమీలిదీ ఇదే పరిస్థితి. అటువంటి పార్టీ క్రమంగా తన పరిధిని విస్తరించుకుంది.

మెజారిటీ సీట్లను దక్కించుకుని…..

పదిహేడో సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర, తూర్పు, పశ్చిమ, ఈశాన్య భారతంలో బీజేపీ విజయదుందుభి మోగించింది. ఆయా రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని తనకు తిరుగులేదని చాటి చెప్పింది. అదే సమయంలో దక్షిణాదిన ప్రభంజనం సృష్టించనప్పటికీ తన పరిధిని పెంచుకుంది. కర్ణాటకలో ఘన విజయం సాధించగా, తెలంగాణలో తన ఉనికిని బలంగా చాటింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన కమలం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఐదు స్థానాలకు ఒకచోట గెలిచింది. శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఓటమి పాలయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో నాలుగు గెలుచుకుని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి సవాల్ విసిరింది. కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, సోయం బాబూరావు ఘనవిజయం సాధించారు. ముఖ్యంగా నిజామాబాద్ లో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా ఆ పార్టీలో వణుకుపుట్టించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఓడించారు. కరీంనగర్ లో కేసీఆర్ సన్నిహితుడు గాలి వినోద్ కుమార్ కు ఎదురుగాలి తప్పలేదు. గత ఎన్నికల్లో ఒక్క స్థానానికి పరిమితమైన పార్టీ నాలుగు సాధించడం విశేషం.

సత్తా చాటి….

మరో రాష్ట్రమైన కర్ణాటకలో కమలం సత్తా చాటింది. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు గాను 25 చోట్ల విజయం సాధించింది. తద్వారా తనకు తిరుగులేదని చాటింది. మాండ్య నియోజకవర్గంలో పోటీ చేసిన సినీనటి సుమలతకు మద్దతు ప్రకటించి గెలిపించింది. 2014 లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు సినీనటుడు అంబరీష్ మరణంతో ఆయన భార్య సుమలత ఇక్కడి నుంచి బరిలోకి దిగారు. మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడను తుముకూరులో ఓడించింది. ఆయనపై బీజేపీ అభ్యర్ధి బసవరాజ్ 13 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో బీజేపీ 17, కాంగ్రెస్ 9, జనతాదళ్ ఎస్ రెండు సీట్లను సాధించాయి. ఈసారి జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేసినా చెరి ఒక స్థానానికి పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ దిగ్గజం మల్లికార్జున ఖర్గే స్వయంగా కలబుర్గలో పరాజయం పాలయ్యారు. ఈయన దళిత నేత.

తమిళనాడు, ఏపీలో…..

తమిళనాడులోని ఏకైక స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. 2014లో కన్యాకుమారి నుంచి పోటీ చేసిన పోన్ రాధా కృష్ణన్ కాంగ్రెస్ అభ్యర్థి వసంత్ కమల్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుతో బరిలోకి దిగిన బీజేపీ చేదు అనుభవం చవిచూసింది. ఆంధ్రప్రదేశ్ లో 2014లో రెండుస్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈ దఫా ఒక్కచోటా గెలవలేకపోయింది. విశాఖపట్నంలో కంభంపాటి హరిబాబు, నర్సాపురంలో గోకరాజు గంగరాజు గెలుపొందారు. ఈసారి పార్టీకి ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.

ఇక్కడ చేదు అనుభవమే….

ఇరవై స్థానాలు గల కేరళలో బీజేపీకి చేదు అనుభవం ఎదురయింది. వాస్తవానికి 2014లో కూడా రాష్ట్రంలో పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఈసారి శబరిఆలయంలో మహిళల ప్రవేశం వివాదం, ముస్లిం మహిళలకు సంబంధించిన ట్రిపుల్ తలాక్ వివాదం, ఆకస్మిక వరదల్లో రాష‌్ట్ర ప్రభుత్వ వైఫల్యం తదితర అంశాలు తమకు మేలు చేస్తాయని కమలం పార్టీ ఆశించింది. ముఖ్యంగా రాష్ట్రరాజధాని తిరువనంతపురంపై అనేక ఆశలు పెట్టుకుంది. మిజోరాం గవర్నర్ గా పనిచేస్తున్న కె.రాజశేఖరన్ రాజీనామా చేసి తిరువనంతపురంలో పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పై పోటీ చేసి ఓడిపోయారు. త్రిశూర్ లో సినీనటుడు సురేష్ గోపికి టిక్కెట్ ఇచ్చినా లాభం లేకపోయింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో ఒక్క స్థానం సాధించకపోయినా కమలం పార్టీ కుంగిపోలేదు. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలపడటానికి ప్రయత్నిస్తోంది. కనీసం ఒక్కో రాష్ట్రంలో ఒక్క సీటును సాధించగలమన్న విశ్వాసంతో ఉంది. అయితే కర్ణాటక, తెలంగాణ ఫలితాలు పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. 28 స్థానాలు గల కర్ణాటకలో 25 గెలుచుకోవడంతో ధీమాగా ఉంది. తెలంగాణలో మొత్తం 17కు గాను నాలుగు స్థానాలను సాధించడంపై పార్టీ సంతృప్తిగా ఉంది. మున్ముందు మరింతగా బలపడాలని పార్టీ యోచనగా ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Ravi Batchali
About Ravi Batchali 38149 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*